మెజారిటీ స్థానాల్లో గెలుస్తం .. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నది: తమిళిసై

మెజారిటీ స్థానాల్లో గెలుస్తం .. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నది: తమిళిసై

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ మెజారిటీ లోక్​సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ గవర్నర్, ఆ పార్టీ సీనియర్ నేత తమిళిసై అన్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉందని తెలిపారు.  మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీస్​లో తమిళిసై మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ 22 సార్లు పర్యటించారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే అప్పటి సీఎం కేసీఆర్ అటెండ్ కాలేదు. గవర్నర్ అయిన నాకు కూడా మర్యాద ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఒకట్రెండు చోట్ల మినహా చాలా స్థానాల్లో వీక్​గా ఉంది’’అని విమర్శించారు.

రిజర్వేషన్ల మీద అసత్య ప్రచారం

రాహుల్ గాంధీ రిజర్వేషన్ల మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. కుల, మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. రిజర్వేషన్ల అంశంపై ప్రధాని, హోంమంత్రి, ఆర్ఎస్ఎస్ పెద్దలు వివరణ ఇచ్చినా తప్పుడు ప్రచారం చేయడం మాత్రం మానడం లేదు’’అని మండిపడ్డారు. కుల రిజర్వేషన్లు వ్యతిరేకించింది, మండల కమిషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. హైదరాబాద్​ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన లేదన్నారు. కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.