గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ అనాసక్తి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ అనాసక్తి

    నామినేషన్లకు రేపే లాస్ట్ డేట్  

    ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించని పార్టీ 
    రేసులో ముగ్గురు నేతలు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెలాఖరులో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఆ పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించ లేదు. గురువారం నాటితో నామినేషన్లకు గడువు పూర్తికానున్నది. అయినా, అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావహులతో పాటు ఆ పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇదే సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పేర్లను ఆయా పార్టీలు ప్రకటించాయి. బీజేపీకి ప్రస్తుతం అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలుండగా, మండలిలో టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్​ కోసం ప్రేమేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పోటీ పడ్తున్నరు. గ్రాడ్యుయేట్ ఓటర్ల ఎన్ రోల్ మెంట్ కోసం మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావును ఇన్​చార్జ్​గా నియమించింది. కానీ, ఎన్నికను పట్టించుకోలేదు. అయితే, టికెట్ కేటాయింపు కోసం పార్టీ హైకమాండ్​కు ఆశావహుల లిస్ట్​ను పంపినట్టు స్టేట్​ లీడర్లు చెప్తున్నారు. చివరి నిమిషంలో ప్రకటిస్తే నామినేషన్ కు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని నేతలు ఆందోళన చెందుతున్నారు.   

12 జిల్లాలు.. 4.61 లక్షల ఓటర్లు 

వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 12 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 4 .61 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. అత్యధికంగా నల్లగొండలో 80,559 మంది, అత్యల్పంగా సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లున్నారు. అయితే, ఈ స్థానం నుంచి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి పోటీ చేయగా 39 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం బీజేపీకి మంచి ఆదరణ ఉందని, పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలూ ఉన్నాయని నేతలు భావిస్తున్నారు.