బీజేపీకి మేలు చేసేందుకు కేసీఆర్ను గవర్నర్ విమర్శిస్తుండ్రు

బీజేపీకి మేలు చేసేందుకు కేసీఆర్ను గవర్నర్  విమర్శిస్తుండ్రు

హైదరాబాద్: కేసీఆర్, టీఆర్ఎస్  ప్రభుత్వాన్ని  విమర్శించడం గవర్నర్ తమిళిసై కి ఫ్యాషన్ గా మారిందని, ఈ పద్ధతి కరెక్ట్ కాదని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాజ్ భవన్ రాజకీయాలకు వేదికగా మారిందని ఆరోపించారు. గవర్నర్  తమిళి సై ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకుంటున్నారని, అందుకే సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. గవర్నర్ ఆఫీస్ ను ఉపయోగించుకొని బీజేపీకి మేలు చేసేందుకు తమిళి సై ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిందనే విషయాన్ని గవర్నర్ గుర్తించుకోవాలని చెప్పారు.

ముందుగా గవర్నర్ గా తన విధులు ఏంటో తెలుసుకోవాలని అన్నారు. ప్రధానితో రాష్ట్రపతి ఎలా అయితే రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నారో.. ఇక్కడ గవర్నర్ కూడా సీఎంతో అలానే వ్యవహరించాలని కోరారు. గతంలో గవర్నర్ గా పని చేసిన నరసింహన్... ముఖ్యమంత్రులతో సఖ్యతతో  వ్యవహరించేవారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడంలో కేసీఆర్ ను మించిన నాయకుడు లేరని తెలిపారు.