సలహాదారుల నియామకాలు ఆపండి.. సీఎస్​కు పద్మనాభరెడ్డి లేఖ

సలహాదారుల  నియామకాలు ఆపండి..  సీఎస్​కు పద్మనాభరెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రిటైర్ అవుతున్న అధికారులను సలహాదారులుగా నియమించడాన్ని ఆపాలని  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌‌జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి శుక్రవారం లేఖ రాశారు. రిటైర్ అ​యిన ఐఏఎస్, ఐపీఎస్ లను సలహాదారులుగా నియమిస్తున్నారని, మరి కొంత మంది రిటైర్ అయిన చీఫ్ ఇంజనీర్లను ఈఎన్సీలుగా, ఇంకొంత మందిని ఆయా శాఖల్లో కన్సల్టెంట్లుగా నియమిస్తూ,  ఓఎస్​డీలుగా ఎక్స్​టెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు. 

కొంత మంది సలహాదారులకు కేబినెట్ హోదా సైతం ఇచ్చారని చెప్పారు. ఇకనైనా ఇలాంటి నియామకాలు, ఎక్స్ టెన్షన్లు ఆపాలని ఆయన కోరారు. ఈడీ డైరెక్టర్​కు మూడోసారి ఎక్స్ టెన్షన్ ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని  సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.  రిటైర్ అయిన వారిని కొనసాగిస్తే ప్రభుత్వ అధినేతలకు  అనుకూలంగా పనిచేస్తారని పద్మనాభరెడ్డి ఆరోపించారు.