హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని.. హాస్టల్ బాత్‌రూంలోనే శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగిన వెంటనే.. ఆ నవజాత శిశువును భవనం పై అంతస్తు నుంచి కిందకు పడేయడంతో.. ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఘటన జరిగిన వెంటనే తీవ్ర రక్తస్రావంతో ఉన్న విద్యార్థినిని చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఇక మృతి చెందిన పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అయితే.. ఇంత పెద్ద హాస్టల్‌లో, అంతమంది సిబ్బంది ఉన్నా.. సదరు విద్యార్థిని గర్భవతి అన్న విషయం కళాశాల యాజమాన్యానికి తెలియకపోవడంపై ఇప్పుడు అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం, వారి భద్రతపై కనీస పర్యవేక్షణ లేదా? హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
ఇక బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. యువతి తన బావ వల్లే గర్భం దాల్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
