పశ్చిమాసియాలో సుధీర్ఘకాలంగా సాగుతోన్న యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతోన్న వేళ బ్రెజిలియన్ ప్రముఖ జర్నలిస్ట్ పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలు చేశారు. జెనీవాలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను, ఆయనతో పాటు ఉన్న పాక్ ప్రతినిధి బృందాన్ని హత్య చేయడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ కుట్ర పన్నిందని ఎస్కోబార్ సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు.
అయితే, ఈ కుట్రను ముందే పసిగట్టిన పాకిస్తాన్ ఇజ్రాయెల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని పేర్కొన్నారు. అసిమ్ మునీర్‌పై చిన్న గీత పడినా ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేస్తామని పాకిస్తాన్ హెచ్చరించిందని ఎస్కోబార్ వెల్లడించారు. అయితే, ఎస్కోబార్ ఆరోపణలను పలువురు పాకిస్తాన్ జర్నలిస్టులు ఖండించారు. ఈ ఆరోపణలను ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, అటు ఇజ్రాయెల్ ప్రభుత్వం గానీ అధికారికంగా ధృవీకరించలేదు.
కాగా, పశ్చిమాసియాలో నాలుగు నెలలుగా సాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాథమిక ఒప్పందానికి ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం (MoU) అని పేరు పెట్టారు.
ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంపై స్విట్జర్లాండ్‌లోని జెనీవా సిటీ వేదికగా అమెరికా, ఇరాన్ బృందాలు తదుపరి చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ఆయన బృందం కూడా పాల్గొంది. ఈ సందర్భంగానే అసిమ్ మునీర్, ఆయన టీమ్ ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ కుట్ర పన్నిందని బ్రెజిలియన్ జర్నలిస్ట్ ఎస్కోబార్ సంచలన ఆరోపణలు చేశారు.
