
హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతుండటంతో విద్యార్థులు బస్సు పాస్ లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సిటీలోని 40 స్టాప్ లలో బస్ పాస్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆన్ లైన్ బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ తెలిపారు. online.tsrtcpass.in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
విద్యార్థులకు బస్ పాస్ లు ఇచ్చే ముందు ఆయా కళాశాలలు అందించే అన్ని కోర్సుల వివరాలను, అవసరమైన పత్రాలను టీఎస్ ఆర్టీసీ బస్ పాస్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు మినహాయించినట్లు తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ బస్ పాస్ కోసం సిటీలోని 40 కౌంటర్లలో తాము ఎంచుకున్న కౌంటర్ వద్ద బస్ పాస్ పొందవచ్చన్నారు.