పుట్టెడు దుఃఖంలోనూ దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ మానవత్వం చాటుకున్నారు. భర్త చనిపోయిన బాధను లోపల దిగమింగుకుని బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరణించిన సెక్యూరిటీ ఆఫీసర్ విధిప్ జాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. 2026, ఫిబ్రవరి 2న స్వయంగా ఫల్తాన్ తాలూకాలోని తార్ద్‌గావ్ గ్రామంలో విధిప్ జాదవ్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు ఆమె సంతాపం తెలిపారు.
విధిప్ జాదవ్ భార్య, పిల్లలను ఓదార్చారు. ప్రతి కష్టంలోనూ అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. ఏ ఆపద వచ్చిన తన దగ్గరికి రావాలని.. అన్ని వేళలా అండగా ఉంటానని చెప్పారు. ఈ ఘటన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు తెప్పించింది. విధిప్ జాదవ్ అజిత్ పవార్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విధిప్ జాదవ్ కూడా మరణించిన విషయం తెలిసిందే.
ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం 2026, జనవరి 28న బారామతి ఎయిర్ స్ట్రిప్‌లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు మరణించారు. మృతుల్లో అజిత్ పవార్ సెక్యూరిటీ విధిప్ జాదవ్ ఒకరు. అజిత్ పవార్ అకాల మరణంతో ఆయన భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా మహారాష్ట్రకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు.
