కరెంట్​ కష్టాలు తీర్చడానికి ఏం చేస్తున్నారంటే..

కరెంట్​ కష్టాలు తీర్చడానికి ఏం చేస్తున్నారంటే..

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ అయిన కోల్ ఇండియా కూడా విదేశాల నుంచి బొగ్గును కొనడానికి రెడీ అయింది.   కేంద్ర పవర్​ మినిస్ట్రీ  ఈ విషయాన్ని వివరిస్తూ రాష్ట్రాలకు లెటర్ కూడా రాసిందని నేషనల్ మీడియా వెల్లడించింది. కరెంటు ఉత్పత్తి తగ్గడం, కోతలు పెరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2015 తర్వాత కోల్ ఇండియా బొగ్గును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. భారతదేశం ఆరేళ్లలో మొదటిసారిగా అత్యంత దారుణమైన కరెంటు కోతలను ఎదుర్కొంటున్నది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో అయితే చాలా రాష్ట్రాల్లో గంటలకొద్దీ కరెంటు సప్లై నిలిచిపోయింది. ఇట్లాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చేయడానికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని కోల్ ఇండియా భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
‘‘కోల్ ఇండియా గవర్నమెంట్​ టు గవర్నమెంట్​ (జీ2జీ) విధానంలో బొగ్గును దిగుమతి చేసుకుంటుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన థర్మల్​ పవర్​ ప్లాంట్లకు, ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లకు అందజేస్తుంది. ఈ బొగ్గును ప్రస్తుతం ఉన్న బొగ్గుకు కలిపి (బ్లెండింగ్​) వాడుకోవాలి”అని ఈ నెల 28న కేంద్ర పవర్​ మినిస్ట్రీ పేర్కొంది. ఈ మేరకు రాసిన లెటర్​ను అన్ని రాష్ట్రాల ప్లాంట్లకు, ఇంధన శాఖలకు, కోల్ ఇండియా చైర్మన్​కు, కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శికి పంపించింది.  2022 మూడవ క్వార్టర్​లో చాలా రాష్ట్రాలు మరోసారి కరెంటు కోతలను విధించక తప్పదని ఆఫీసర్లు అంటున్నారు. కరెంటుకు విపరీతంగా డిమాండ్ ఉండటంతో ఇక ముందు మరింత బొగ్గు కొరతను ప్రభుత్వం ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. 
రాష్ట్రాలు సొంతంగా బొగ్గు దిగుమతి టెండర్లు పిలిస్తే గందరగోళానికి దారి తీసే అవకాశం ఉందని, కోల్ ఇండియా ద్వారానే బొగ్గు సేకరించాలని దాదాపు అన్ని రాష్ట్రాలు సూచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవర్​ మినిస్ట్రీ  పేర్కొంది. డిమాండ్​ సమస్యను పరిష్కరించడానికి స్థానిక బొగ్గుకు విదేశీ బొగ్గును కలపాలని  తయారీ కంపెనీలకు, ప్లాంట్లకు స్పష్టం చేసింది.

కరెంటు ప్లాంట్లు దిగుమతుల ద్వారా బొగ్గు నిల్వలను పెంచుకోకపోతే దేశీయ బొగ్గు గనుల నుంచి వచ్చే బొగ్గు సరఫరాలో కోత విధిస్తామని హెచ్చరించింది. కోల్​ ఇండియా నిర్ణయం వచ్చే వరకు బొగ్గు కొనుగోలు టెండర్లను నిలిపివేయాలని శనివారం రాష్ట్రాలను కోరింది. జీ2జీ విధానం ద్వారా కోల్ ఇండియా ధరల నిర్ణయించే దాకా ఆగాలని, దీనివల్ల బొగ్గును తక్కువ ధరలకు కొనడం సాధ్యపడుతుందని పేర్కొంది.  కరెంటు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఏప్రిల్ నుండి 13 శాతం తగ్గాయి. వేసవికి ముందు చాలా ఏళ్ల కనిష్టస్థాయిలకు చేరుకున్నాయి.

 

ఇవి కూడా చదవండి

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చేసినందుకు..

మల్లారెడ్డికి నిరసన సెగ

ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స