మహిళల గర్భదారణ అంశంపై సుప్రీం కోర్టు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో ఇష్టానికి విరుద్ధంగా అవాంఛిత గర్భధారణ జరిగినప్పుడు వారికి ఉన్న హక్కుల గురించి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు, దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను.. మరీ ముఖ్యంగా మైనర్ బాలికలను బలవంతం చేయలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్‌గా ఉన్న సమయంలో ఒక యువతికి సంబంధించిన 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. ఇలాంటి సున్నితమైన కేసుల్లో మైనర్ బాలిక హక్కులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక మహిళకు ఆమె ఇష్టానికి విరుద్ధంగా తల్లి అవ్వమనలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ALSO READ : ఇవి తింటే డిప్రెషన్ మాయం..
ఈ కేసులో మైనర్ బాలిక ఒక యువకుడితో ఏర్పడిన సంబంధం కారణంగా గర్భవతి అయిందని.. అయితే ఆ సంబంధం సమ్మతితో కూడుకున్నదా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదని కోర్టు పేర్కొంది. ప్రధానంగా ఆ బాలికకు ఆ బిడ్డను కనడం ఇష్టం లేదన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం నొక్కి చెప్పింది. చట్టరీత్యా మైనర్ గర్భం దాల్చడం అనేది ఒక దురదృష్టకర పరిస్థితి అయినప్పటికీ.. అటువంటి పరిస్థితుల్లో గర్భాన్ని కొనసాగించమని ఒత్తిడి చేయడం ఆమె స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు బలంగా ఉన్నప్పటికీ.. బాలిక భవిష్యత్తు, ఆమె మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఒక మహిళ తన గర్భాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉంటుందని.. బలవంతంగా గర్భం దాల్చేలా ఏ వ్యవస్థా ఒత్తిడి చేయలేదని తాజా తీర్పులో స్పష్టం చేసింది. అప్పీలుదారు చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. వైద్య నిబంధనల ప్రకారం అబార్షన్ చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈ ప్రక్రియ కోసం ముంబైలోని జేజే ఆసుపత్రిలో అవసరమైన అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది.
ముంబై జేజే ఆసుపత్రి వైద్యులు ఈ అబార్షన్ ప్రక్రియను నిర్వహించాలని.. ఇందుకోసం బాలిక రాతపూర్వక అంగీకారం తెలపాలని కోర్టు సూచించింది. మహిళల శారీరక హక్కులు, వారి స్వేచ్ఛకు సంబంధించి ఈ తీర్పు అత్యంత కీలకమైనదిగా నిలుస్తుంది. మైనర్ల విషయంలో వారి ప్రాణాలకు ప్రమాదం లేకుండా.. సామాజిక, వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకుని మానవీయ కోణంలో ప్రస్తుత కేసులో నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.
