మెడికల్ ఫీజుల వివాదంలోజోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు 

మెడికల్ ఫీజుల వివాదంలోజోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు 
  • సీట్ల విభజన, ఫీజుల ఖరారు జీవోలపై సుప్రీం కోర్టు వ్యాఖ్య
  • సత్వర విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు సూచన
  • పిటిషన్లపై విచారణ ముగించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వైద్య విద్య ఫీజుల ఖరారు, సీట్ల విభజన వివాదంపై ఈ దశలో నేరుగా జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో 2017 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) పై సత్వరమే విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తూ.. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లపై విచారణను ముగించింది. మంగళవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.  

తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రి నాయుడు, అల్లంకి రమేశ్​లు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. సీట్ల విభజన, ఫీజుల ఖరారుపై 2017–--18 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది. కన్వీనర్ కోటా విద్యార్థులకు తక్కువ ఫీజు నిర్ణయించి, ఆ భారాన్ని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, ఎన్ఆర్ఐలపై మోపడాన్ని వ్యతిరేకిస్తూ యాజమాన్యాలు అప్పట్లో కోర్టును ఆశ్రయించాయి.

ఎన్ఆర్ఐ మినహా అందరికీ ఒకే ఫీజు ఉండాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఫీజుల సవరణ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అప్పటినుంచి ఈ పిల్ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం, ప్రతి విద్యా సంవత్సరానికీ ప్రభుత్వం ఫీజుల జీవోలు ఇవ్వడం, వాటిపై న్యాయస్థానాల్లో స్టేలు రావడం జరుగుతోంది. ఏడేళ్లు గడుస్తున్నా వివాదం కొలిక్కి రాకపోవడంతో యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 

ఇప్పటికే మూడు బ్యాచ్‌‌‌‌‌‌‌‌లు వెళ్లిపోయాయి..

రాష్ట్ర ప్రభుత్వ జీవోలతో తమపై తీవ్ర భారం పడుతోందని యాజమాన్యాల తరఫున సీనియర్ అడ్వొకేట్లు వాదనలు వినిపించారు. 2017 నుంచి ఇప్పటివరకు మూడు బ్యాచ్‌‌‌‌‌‌‌‌లు వైద్య విద్య పూర్తి చేసుకుని వెళ్లిపోయాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ జీవోలపై ఎప్పటికప్పుడు స్టేలు వస్తుండటంతో కాలేజీల నిర్వహణ భారంగా మారిందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని నివేదించారు.

ఈ జాప్యాన్ని నివారిస్తూ కేసును త్వరగా పరిష్కరించేలా హైకోర్టుకు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ప్రస్తుత సమయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అయితే తెలంగాణ హైకోర్టులోని పిల్ సత్వర పరిష్కారం కోసం విచారణ జరపాలని హైకోర్టుకు సూచిస్తూ, తమ ముందున్న పిటిషన్లను ముగిస్తున్నట్లు సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది.