- నల్ల బాలు క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టుకు ఆదేశం
- పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి పోలీసుల కేసులపై హైకోర్టు గైడ్‌లైన్స్ పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని అభిప్రాయపడింది. యాంత్రిక కేసుల నమోదును నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా కాంగ్రెస్ పార్టీ, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్ల బాలు (దుర్గం శశిధర్ గౌడ్), వసీం అక్రం, కౌతం సతీశ్, జి.సతీశ్‌లపై పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
వీటిని కొట్టివేయాలని నల్ల బాలుతో పాటు మిగిలిన వారు హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఎఫ్‌ఐఆర్‌లను క్వాష్ చేస్తూ.. గైడ్‌లైన్స్ జారీ చేసింది. ట్వీట్లు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని, ప్రాథమిక హక్కుల పరిరక్షణతోపాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్టు పేర్కొంది.
అయితే, కోర్టు మార్గదర్శకాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల బెంచ్ విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ... కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లడం లేదని, హైకోర్టు విధించిన కొన్ని గైడ్‌లైన్స్ సమర్థనీయంగా లేవన్నారు. గైడ్‌లైన్స్‌లోని పలు అంశాలు పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.
రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పిందని నివేదించారు. అయితే.. ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వకూడదా? అని ప్రశ్నించింది. హైకోర్టు గైడ్ లైన్స్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకేమీ కనిపించడం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
