పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో పెట్టుకునే శారీరక సంబంధం నేరం కాదని, దాని ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, ప్రతి రిలేషన్ షిప్ పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపిక రద్దును కొట్టివేస్తూ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే.. సదరు యువకుడు 2014లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ పొరుగున ఉండే ఓ యువతి ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. అయితే 2015లోనే లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాలు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. ఆ తర్వాత అతను కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై, తన అప్లికేషన్ ఫామ్‌లో ఈ కేసు వివరాలను నిజాయితీగా పేర్కొన్నాడు. కానీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మాత్రం సదరు అభ్యర్థిపై నైతిక ప్రవర్తన లోపించిందనే నెపంతో అతని ఎంపికను రద్దు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయాన్నే సమర్థించడంతో ఆ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
►ALSO READ | ఇంత సంతోషం ఏమైపోయిందో.. విషాద ఘటన.. హ్యాపీ కపుల్ అన్నారు.. కానీ చివరకు..
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇద్దరు అవివాహిత మేజర్లు తమ ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం కలిగి ఉండటాన్ని ఏ చట్టమూ నిషేధించలేదని తేల్చి చెప్పింది. కేవలం ఆ బంధం పెళ్లిగా మారనంత మాత్రాన, ఒకరు మరొకరిని మోసం చేశారని లేదా ఆ వ్యక్తికి మంచి క్యారెక్టర్ లేదని అర్ధం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే లోక్ అదాలత్‌లో కేసు సెటిల్ అయినంత మాత్రాన అభ్యర్థి తన తప్పును ఒప్పుకున్నట్లు కాదని, బాధితురాలిపై ఎలాంటి ఒత్తిడి లేనప్పుడు యజమానులు దాన్ని తప్పుగా భావించకూడదని స్పష్టం చేసింది.
బాధితురాలు స్వయంగా కేసును ముందుకు తీసుకెళ్లకుండా రాజీ పడినప్పుడు.. అభ్యర్థికి పోలీస్ ఉద్యోగానికి అవసరమైన క్యారెక్టర్ లేదని రిక్రూట్‌మెంట్ బోర్డు ఎలా భావిస్తుందని కోర్టు ప్రశ్నించింది. నేర పరిశీలన చేసేటప్పుడు ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని, ఈ కేసులో మోసం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. చివరకు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదేశాలను పక్కనబెడుతూ, బాధితుడి కానిస్టేబుల్ ఉద్యోగ ఎంపికను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుత సామాజిక మార్పులను ప్రతిబింబించేలా ఉన్న ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
