మైసూర్: మైసూర్‌లో విషాద ఘటన జరిగింది. మైసూరులోని సరస్వతీపురం ప్రాంతంలో 30 ఏళ్ల గృహిణి ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళను సంధ్యగా గుర్తించారు. ఆమె సరస్వతీపురంలోని జవరాయగౌడ పార్క్ సమీపంలో ఉన్న ఇంట్లో ఉంటోంది. సంధ్యకు టీకే లేఅవుట్‌కు చెందిన.. అక్షయ్‌తో పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహమే కావడం గమనార్హం.
అయితే.. గత కొన్ని నెలలుగా ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు ఆరోపించారు. ఎప్పుడూ గొడవలు పడుతూ.. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ ఒకరితో ఒకరు అంటీముట్టన్నట్లు ఉంటున్నారని చెప్పారు. సంధ్య ఆత్మహత్య చేసుకున్నారనే అవకాశాన్ని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు మరియు ఆమె హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని.. అలాగే ఘటనకు ముందు ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తుల పాత్రను పరిశీలించాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.
ALSO READ : ఇంతకన్నా దిగజారారుడుతనం ఉంటుందా...?
ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, దంపతుల మధ్య ఏమైనా గొడవలు జరిగాయేమోనని ఆరా తీస్తున్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లను పరిశీలించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని.. ఏ కోణాన్ని కూడా తోసిపుచ్చలేదని పోలీసులు తెలిపారు. ఈ దర్యాప్తులో పోస్ట్‌మార్టం నివేదిక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక హత్య జరిగిందో.. ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో పోలీసు అధికారులు తెలిపారు.
