ఇకపై కోర్టుల్లో ఏఐ వినియోగం ..డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన సుప్రీంకోర్టు

ఇకపై కోర్టుల్లో ఏఐ వినియోగం ..డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన సుప్రీంకోర్టు
  • 35 పేజీల డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన సుప్రీంకోర్టు 
  • జూన్ 20లోగా సూచనలివ్వాలని దేశప్రజలకు విజ్ఞప్తి
  • సుప్రీంకోర్టు నుంచి దిగువ కోర్టుల వరకూ రూల్స్ వర్తింపు 

దేశంలో న్యాయ వ్యవస్థను ఆధునీకరించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్నిరకాల కోర్టుల్లో ఏఐని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా గురువారం 35 పేజీల సమగ్ర ‘డ్రాఫ్ట్ రెగ్యులేషన్(ముసాయిదా నిబంధనలు)’ను విడుదల చేసింది.

న్యూఢిల్లీ:దేశంలో న్యాయ వ్యవస్థను ఆధునీకరించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్నిరకాల కోర్టుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా గురువారం 35 పేజీల సమగ్ర ‘డ్రాఫ్ట్ రెగ్యులేషన్(ముసాయిదా నిబంధనలు)’ను విడుదల చేసింది. దీనిపై జూన్ 20 లోగా తమ అభిప్రాయాలు, సూచనలను పంపాల్సిందిగా సంబంధిత వర్గాలను, దేశ ప్రజలను సుప్రీంకోర్టు ఏఐ కమిటీ కోరింది. 

న్యాయ వ్యవస్థలో ఏఐ సాంకేతికతను వేటికి ఉపయోగించాలి, వేటికి ఉపయోగించకూడదనే అంశాలపై ముసాయిదాలో సుప్రీంకోర్టు స్పష్టమైన రూల్స్ పెట్టింది. ఇవి దేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టులు, అన్ని దిగువ కోర్టులతో పాటు ట్రిబ్యునళ్లకు కూడా వర్తిస్తాయి. డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ప్రకారం.. కోర్టు ప్రక్రియల్లో ఏఐ వినియోగం కచ్చితంగా మానవ మేధస్సుకు లోబడే ఉండాలి. కేవలం సాఫ్ట్‌‌‌‌వేర్ లెక్కల ఆధారంగా తీర్పులను ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ముఖ్యంగా కోర్టు తీర్పులు ఇవ్వడం, శిక్షలు ఖరారు చేయడం, సాక్షులు కోర్టులో చెబుతున్న మాటలు ఎంతవరకు నిజమనేది అంచనా వేయడం వంటి అంశాల్లో  ఏఐని ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించారు. న్యాయపరమైన అన్ని పనుల్లోనూ కచ్చితంగా మానవ పర్యవేక్షణ ఉండాలి. అంటే తుది నిర్ణయాధికారం కేవలం న్యాయాధికారి వద్దే ఉంటుంది. ఏఐ కేవలం ఒక సహాయక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది కానీ న్యాయమూర్తుల స్థానాన్ని భర్తీ చేయలేదని వివరించింది. 

కేసుల పరిష్కారానికి గడువుపై పిల్ కొట్టివేత..   

దేశవ్యాప్తంగా కేసుల కాలపరిమితితో కూడిన పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించి, అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశంలోని అన్ని కోర్టుల్లో వాయిదాలను నియంత్రించడానికి ఏకరీతి, నిర్మాణాత్మక, అమలు చేయదగిన మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఒక న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌‌‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టివేసింది. 

కోర్టులలో కేసుల అనియంత్రిత వాయిదాలపై మార్గదర్శకాలు కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు వ్యక్తిగతంగా హాజరైన పిటిషనర్ ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ..  ‘‘మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్లు, జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ల వద్దకు వెళ్లండి” అని పేర్కొంది. ఇదే సమయంలో ‘‘మేము న్యాయవాదులతో శత్రుత్వం పెంచుకోవాలనుకోవడం లేదు.. మేము న్యాయవాదులతో స్నేహితులమే” అని ధర్మాసనం సరదాగా వ్యాఖ్యానించింది.