- దేశ ప్రజల ప్రైవసీపై రాజీపడేది లేదు
- యూజర్ల డేటా షేరింగ్‌కు అనుమతించం
- వాట్సాప్ చాలా తెలివిగా ప్రైవసీ పాలసీ తెచ్చింది
- అతి సామాన్యులకు ఎవరికీ అర్థంకాదని ఫైర్
- డేటా షేరింగ్ చేయబోమని హామీ ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీ విషయంలో సోషల్ మీడియా సంస్థలు మెటా, వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజర్ల డేటా షేరింగ్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల ప్రైవసీ విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్ని పాటించకుంటే, దేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్‌ఏటీ) తీర్పును సవాల్ చేస్తూ మెటా, వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. యూజర్ల డేటా చోరీకి వీలుగా ప్రైవసీ పాలసీ తెచ్చారని, ఆ డేటాను కమర్షియల్ పర్పస్ కు వాడుకుంటున్నారని తెలిపారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. మెటా, వాట్సాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘డేటా షేరింగ్ పేరుతో ప్రజల ప్రైవసీతో ఆటలాడొద్దు. యూజర్ల డేటా నుంచి ఒక్క పదం షేర్ చేసేందుకు కూడా అనుమతించం. ప్రజల ప్రైవసీ విషయంలో రాజీపడం. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రైవసీ హక్కును మీరు ఉల్లంఘిస్తున్నారు. మా రాజ్యాంగాన్ని పాటించకుంటే.. మా దేశం నుంచి వెళ్లిపోండి” అని హెచ్చరించింది.
సామాన్యులకు ఎట్ల అర్థమైతది?
వాట్సాప్ చాలా తెలివిగా ప్రైవసీ పాలసీని రూపొందించిందని కోర్టు వ్యాఖ్యానించింది. అది సామాన్య ప్రజలకు అర్థమయ్యే అవకాశమే లేదని పేర్కొంది. ‘‘మీ పాలసీలను అర్థం చేసుకోవడానికి మేమే కష్టపడాల్సి వస్తుంది. మరి సామాన్య జనం ఎలా అర్థం చేసుకుంటారు. మీ ప్రైవసీ పాలసీ రూల్స్.. పేదలు, చిరు వ్యాపారులు, చదువురానివాళ్లకు ఎలా తెలుస్తాయి? ఇది ప్రజల సమాచారాన్ని దొంగిలించడమే” అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తనకు ఎదురైన పరిస్థితిని వివరిస్తూ.. ‘‘నాకు ఒకసారి వాట్సాప్‌లో డాక్టర్ మెడిసిన్స్ లిస్ట్ పంపారు. తర్వాత వాటికి సంబంధించిన యాడ్స్ నా ఫోన్‌లో కనిపించడం ప్రారంభమైంది” అని పేర్కొన్నారు. ‘‘ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఇదొక మార్గం. కానీ దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించం. డేటా షేరింగ్ చేయబోమని మీరు మాకు హామీ ఇవ్వండి. లేదంటే ఈ నెల 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తాం” అని బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీని కూడా భాగం చేయాలని ఆదేశాలిచ్చింది.
ఏంటీ కేసు?
వాట్సాప్ 2021లో కొత్త ప్రైవసీ పాలసీ తెచ్చింది. వాట్సాప్ యూజర్లు తమ డేటాను మెటాతో పంచుకోవడాన్ని తప్పనిసరి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేపట్టింది. మెటాకు రూ.213 కోట్ల జరిమానా విధించింది. వాట్సాప్ తమ యూజర్ల డేటాను అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం ఇతర మెటా సంస్థలకు ఐదేండ్ల వరకు షేర్ చేయకూడదని ఆదేశించింది. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్‌ఏటీ)ను మెటా ఆశ్రయించింది. లా ట్రిబ్యునల్ విచారణ చేపట్టి.. ఐదేండ్ల నిబంధనను పక్కనపెట్టి, జరిమానా కట్టాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మెటా, వాట్సాప్ పిటిషన్లు దాఖలు చేశాయి.
