
తమిళ స్టార్ హీరో సూర్య జయపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' మూవీలో సూర్య రోలెక్స్ అనే కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఈ హీరో పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం తన 42వ మూవీని ప్రారంభించాడు. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతలుగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కాగా ఇవాళ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు.
సూర్య42 నుంచి మోషన్ పోస్టర్ ను వదిలారు. యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతుండగా.. ఓ గద్ద ఆకాశంలో విహరిస్తూ సూర్య భుజంపై వాలడంతో అతని బ్యాక్ సైడ్ లుక్ అవుతుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి బీజీఎం సమకూర్చాడు. ఇందులో చేతిలో ఆయుధాలతో సూర్య ని ఒక వారియర్ గా కనిపిస్తున్నాడు. ఇదొక శక్తివంతమైన పరాక్రమవంతుడి సాగా అని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 3డీ లో రూపొందిస్తున్నామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాకు వెట్రి ఫలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మిలాన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిశా పటానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రెడిన్ కింగ్స్, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.