- మార్జిన్ సరిపోవడం లేదని ఓనర్స్ నిరసన
- షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, వాటర్ ఖర్చులు, అమ్ముడుపోని చికెన్‌తో నష్టపోతున్నామని ఆవేదన
- పెరిగిన ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్ ఫోర్ట్, కోళ్ల మరణాలతో తప్పడం లేదంటున్న పౌల్ట్రీ రంగం
- హైదరాబాద్‌లో హోటల్ రంగం, ఫుడ్ డెలివరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై పడనున్న ప్రభావం
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూసివేయాలని చికెన్షాప్ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తమకు మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామని అంటున్నారు. అయితే ఫీడ్ ధరలు పెరగడం, మెడిసిన్, ట్రాన్స్ పోర్ట్, కోళ్ల మరణాలతో లైవ్ చికెన్ రేట్లు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ రంగం పేర్కొంటున్నది. షాపులు మూత పడితే హోటల్ రంగం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడనుంది.
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేయాలని చికెన్ అసోసియేషన్ ప్రకటించింది. మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామని చికెన్ షాపు యజమానులు పేర్కొన్నారు. గతంలో కిలో చికెన్‌కు రూ.30 నుంచి రూ. 35 వరకు మిగిలేదని.. ఇప్పుడు చికెన్రేటు పెరిగినా రూ.6 మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలే లాభపడుతున్నాయని, మార్జిన్ పెంచి ఆదుకోవాలని ఓనర్స్కోరుతున్నారు.
రిటైల్ షాపులకు ఇబ్బందులు..
పౌల్ట్రీ రైతులు కోళ్లను పెంచితే వెన్ కాబ్, స్నేహ, సుగుణ సహా ఇతర కంపెనీలు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటాయి. రైతుల దగ్గర హోల్ సేల్ లో కొని రిటైల్ షాపులకు అమ్ముతుంటారు. చికెన్ రేటును పౌల్ట్రీ కంపెనీలే నిర్ణయిస్తాయి. రైతుల నుంచి తక్కువకు కొని తమకు అధిక ధరలకు అమ్ముతుండడంతో ధరలు పెరుగుతున్నాయని షాపుల ఓనర్లు ఆరోపిస్తున్నారు. కానీ, మార్జిన్ మాత్రం పెంచడం లేదంటున్నారు.
‘మార్జిన్’ అంటే ఏమిటి ?
‘మార్జిన్’అంటే కిలో చికెన్ అమ్మినప్పుడు మిగిలే లాభం. కొనుగోలు, అమ్మకపు ధరల మధ్య తేడా కాకుండా మధ్యలో వచ్చే ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలేది. ఉదాహరణకు.. షాప్ ఓనర్ లైవ్ చికెన్‌ను కిలో రూ.120 కి కొన్నాడనుకుందాం. దాన్ని కట్ చేసి అమ్మేటప్పుడు వేస్టేజీ తీసేస్తారు. దీంతో కిలో లైవ్ కోడి నుంచి 700 నుంచి 750 గ్రాముల చికెన్ అవుతుంది. దీంతో కిలో చికెన్ రూ.150 నుంచి రూ. 160 వరకు పెరుగుతుంది. కస్టమర్‌కు రూ.200కు అమ్మితే రూ.40 మార్జిన్ ఉన్నట్టు కనిపించినా, అది పూర్తిగా లాభం కాదు. రిటైల్ చికెన్ షాపుల్లో రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, వాటర్ ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ ..ఇవన్నీ తీసేస్తే కిలోకి రూ.5 నుంచి రూ. 6 మాత్రమే మిగులుతోందని చికెన్ షాప్ ఓనర్స్ చెప్తున్నారు.
ఫీడ్ ధరలు పెరిగినయంటున్న కంపెనీలు..
మొక్కజొన్న, సోయా ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాల రిస్క్ భారీగా పెరుగడంతో ధరలు పెంచాల్సి వస్తుందని తెలుపుతున్నాయి. ఫార్మ్ స్థాయిలోనే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అంటున్నాయి. దీనికి తోడు కరెంట్, ట్రాన్స్‌పోర్టేషన్, కూలీల ఖర్చు పెరిగిందని, అందుకే లైవ్ చికెన్ ధరను పెంచుతున్నామని చెప్తున్నాయి. అయితే, మార్జిన్పెంపుపై మాత్రం కంపెనీలు మాట్లాడడం లేదు. మూడు నెలల కింద మార్జిన్ ధర పెంచుతామని చెప్పినా ఇప్పటివరకు పెంచలేదు. కిలో చికెన్ మీద వచ్చే లాభాన్ని రైతులు, సరఫరాదారులు, షాప్ ఓనర్స్ మధ్య ఎలా పంచుకోవాలన్నదే ప్రధాన సమస్యగా మారింది.
వేలల్లో చికెన్ షాపులు..
హైదరాబాద్ సిటీలోనే 8 వేల నుంచి 10 వేల వరకు చికెన్ షాపులున్నాయి. రిటైల్ దుకాణాల నుంచి పెద్ద మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. ఈ బిజినెస్‌పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. హైదరాబాద్‌లో రోజుకు 4–6 లక్షల కోళ్లు వినియోగమవుతుండగా, వీకెండ్స్‌లో 7 నుంచి 8 లక్షలకు పెరుగుతోంది. రోజువారీగా 800 నుంచి1000 టన్నుల చికెన్ సరఫరా జరుగుతోంది. హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ రంగాలు కూడా దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. షాపులు మూసి వేస్తే వేలాది కుటుంబాల ఉపాధి కోల్పోతాయి.
బిర్యానీ సెంటర్లకు పెద్ద దెబ్బే..
నగరంలో చికెన్ షాపులు మూసేస్తే బిర్యానీ బిజినెస్దెబ్బతింటుంది. సిటీలో 6 వేల నుంచి 8 వేల వరకు బిర్యానీ సెంటర్లుండగా, 70 నుంచి 80 శాతం చికెన్ బిర్యానీల కోసం ఆర్డర్లు వస్తుంటాయి. ఈ లెక్కన రోజుకు 10- నుంచి 15 లక్షల బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. చికెన్ షాపులు మూసివేస్తే 4,500 నుంచి 6,000 సెంటర్లపై ప్రభావం పడుతుంది. చికెన్ మెనూ ఐటమ్స్ తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఎగ్ ఐటంలే దిక్కు..
చికెన్ లేకపోతే హోటల్స్ ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశం ఉంది. మటన్ ధరలు ఎక్కువగా ఉండడంతో గుడ్లతో తయారయ్యే ఐటమ్స్‌పై ఆధారపడే చాన్స్ఉంది. ఎగ్ బిర్యానీ, ఆమ్లెట్, ఎగ్ ఫ్రై వంటి వంటకాలకు డిమాండ్ పెరగనుంది. కొన్ని హోటల్స్తమ మెనూలో చికెన్ ఐటమ్స్ తగ్గించి ఎగ్ ఐటమ్స్‌ను పెంచవచ్చు. దీంతో గుడ్ల కు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు 50- నుంచి 70 లక్షల గుడ్లు అమ్ముడు పోతుండగా 30 శాతం వరకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
బర్గర్, పిజ్జా, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కూడా..
చికెన్ షాపులు మూసివేస్తే ఫాస్ట్ ఫుడ్ రంగానికీ ఆ సెగ తాకనుంది. సిటీలో వేల సంఖ్యలో ఉన్న బర్గర్, పిజ్జా షాపులు, చైనీస్ ఫుడ్ సెంటర్లు ప్రధానంగా చికెన్‌పైనే ఆధారపడి పని చేస్తున్నాయి. చికెన్ సరఫరా తగ్గితే వీటిలో 60 నుంచి 70 శాతం అవుట్‌లెట్లు నేరుగా ప్రభావితం అవుతాయి. వెజ్ ఆప్షన్లకు మారడమో, లేక మెనూలో ఐటమ్స్ తగ్గించాలి.
- తెలంగాణ పౌల్ట్రీ ఫార్మ్స్: 3,850
- హైదరాబాద్ పరిసర ఫార్మ్స్: 200–250
- హోల్‌సేల్ యూనిట్లు: 300–500
- రిటైల్ చికెన్ షాపులు: 8,000–10,000
- బర్గర్ & పిజ్జా షాపులు: 2,000–3,000
- చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు: 3,000–5,000
కిలోకు రూ. 45 లాభం వచ్చేలా చూడాలి
చికెన్ రిటైల్ షాపులు పూర్తిగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. కిలోకు రూ. 5 నుంచి 6 మాత్రమే మిగులుతోంది. దీంతో తాము రెంట్ లు కట్టలేక, కూలీలకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. కిలోకు రూ. 45 వరకు లాభం వచ్చేలా పౌల్ట్రీ కంపెనీలు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి తాము చికెన్ షాప్స్ ను క్లోజ్ చేస్తాం. ఇప్పటికే ఆయా కంపెనీల వారితో మాట్లాడిన స్పష్టత ఇవ్వడం లేదు.
కిరణ్, చికెన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్
