426 ప్రైవేట్ కాలేజీలకు అఫిలియేషన్ గండం!

426 ప్రైవేట్ కాలేజీలకు అఫిలియేషన్ గండం!
  •     ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్లు 
  •     ఆందోళనలో స్టూడెంట్లు, పేరెంట్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్​కాలేజీలకు అఫిలియేషన్ (గుర్తింపు)పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అఫిలియేషన్​కు గతేడాది​ మాదిరి సర్కార్ కొన్ని రూల్స్ సడలించినా, మిక్స్​డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లో కొనసాగుతున్న కాలేజీలకు గుర్తింపుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీంతో స్టూడెంట్లు, పేరెంట్స్​లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా1,626 ప్రైవేట్​జూనియర్ కాలేజీలు ఉండగా.. వాటిలో 426 మిక్స్​డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. ఇవి గాక ఆయా బిల్డింగుల్లో 15 మీటర్ల పైన ఉన్న కాలేజీలు 66 ఉన్నాయి. పోయినేడాది ఫైర్ సేఫ్టీ విషయయమై ఆ కాలేజీలకు సర్కార్ గుర్తింపు ఇవ్వలేదు. తర్వాత మేనేజ్​మెంట్ల ఒత్తిడి, కరోనా కారణంగా మిక్స్​డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లోని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్..  15 మీటర్ల పైన ఉన్న 66 కాలేజీలకు మాత్రం గుర్తింపు ఇవ్వలేదు. వాటిలో కొన్ని కాలేజీలు మూతపడగా, మరికొన్నింటిని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేశారు. ఈ ఏడాది మళ్లీ అదే సమస్య తలెత్తింది. ఈసారి కూడా మిక్స్​డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లోని కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని మేనేజ్​మెంట్లు కోరడంతో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ జూన్​24న విద్యాశాఖకు లెటర్ రాశారు. అయితే విద్యాశాఖ ఇప్పటి వరకు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్, మినిస్టర్ సబితారెడ్డి చొరవ తీసుకుని ఆ కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని ప్రైవేట్ కాలేజీల మేనేజ్​మెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ విజ్ఞప్తి చేశారు. 

ఒక్క కాలేజీకి గుర్తింపు రాలే.. 

ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఇంటర్ బోర్డు అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదు. రెండు వారాల కింద సర్కార్ నిబంధనలు సడలించగా, మేనేజ్ మెంట్లు అప్లికేషన్లు పెట్టుకుంటున్నాయి. ఈసారి 52 కాలేజీలు షిఫ్టింగ్​కు దరఖాస్తు చేసుకోగా, ఆ కాలేజీల్లోనూ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. అయినా బోర్డు మాత్రం ఆ కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు గుర్తింపు లేని, అనుమతి లేని భవనాల్లో కొనసాగే కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని.. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఉమర్ జలీల్ ఇటీవల హెచ్చరించడం గమనార్హం.