- హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. లాయర్ల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో ఈడీ రిజిస్టర్ చేసిన కేసును కొట్టేయాలని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఈ కేసులో ఈడీ ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నదని పిటిషన్లో పేర్కొన్నాడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకోవాలని తాను మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈ కారణంగానే ఈడీ తనపై తప్పుడు కేసు బనాయించిందన్నారు.
15న కేసు పెట్టి అదే రోజు సమ న్లు ఇచ్చిందని, అయ్యప్ప దీక్షలో ఉన్నానని, 19న దర్యాప్తునకు రాలేనని లేఖ రాస్తే.. వీలుకాదని చెబితే 19, 20 తేదీల్లో విచారణకు హాజరైనట్లు చెప్పారు. ఏ కేసు పెట్టారో చెప్పలేదని, అడిగితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసని చెప్పారని వివరించారు. ఈ రిట్ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించనున్నారు.
ఈడీ విచారణకు రోహిత్ డుమ్మా
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణకు పైలెట్ రోహిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కానీ రోహిత్‌రెడ్డి రాలేదు. ఈడీ కేసు నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించానని, రిట్ పిటిషన్ బుధవారం విచారణకు రాబోతున్నదని తెలిపారు. మంగళవారం ఈ మేరకు మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. ఈడీ విచారణకు హాజరయ్యే విషయంపై లాయర్ల సల హాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
లాయర్ల సూచనల మేరకు వ్యక్తిగతంగా వెళ్లడం లేదా ఎవరినైనా తన తరఫున పంపించడం లేదా మెయిల్ ద్వారా సమాచారం అందివ్వడం చేస్తానని తెలిపారు. ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదని చెప్పుకొచ్చారు. ఏ రకంగా ఈడీ కేసు నమోదు చేసిందనేది అర్థం కావడంలేదని తెలిపారు.
