ప్రతి ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఆసుపత్రిలోడయాలసిస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రతి ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఆసుపత్రిలోడయాలసిస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయకు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వినతి
  • 15 డిస్పెన్సరీలు, 3 ఈఎస్ఐ హాస్పిటల్స్​ మంజూరు చేయండి
  • రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ సేవలను  మరింత విస్తరించాలని రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌
  • సనత్ నగర్ ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఆసుపత్రిలో అత్యాధునిక ఓపీడీ భవనం ప్రారంభం
  • 40 ఏండ్లు దాటిన వారికి ఏటా ఉచిత వైద్య పరీక్షలు: మన్​సుఖ్​ మాండవీయ 
  • మంత్రి వివేక్  చేసిన విజ్ఞప్తులపై సానుకూలత.. అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు


హైదరాబాద్, వెలుగు:కార్మికుల వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌‌‌‌‌‌ఐ సేవలను మరింత విస్తరించాలని కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు.  సనత్‌‌‌‌నగర్‌‌‌‌ ఈఎస్‌‌‌‌ఐపై ఉన్న విపరీతమైన ఒత్తిడిని తగ్గించేందుకు నగర శివారు ప్రాంతాల్లోని ఆసుపత్రులను ‘తృతీయ శ్రేణి  ఆసుపత్రులు’గా తీర్చిదిద్దాలని రిక్వెస్ట్‌‌‌‌ చేశారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న 3 కొత్త ఈఎస్‌‌‌‌ఐ హాస్పిటల్స్​, రద్దయిన 15 డిస్పెన్సరీలను వెంటనే రాష్ట్రానికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను స్వయంగా వైద్యుడిని కావడంతో చెబుతున్నానని, కిడ్నీ వ్యాధులు తీవ్రంగా పెరుగుతున్నందున దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఈఎస్‌‌‌‌ఐ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా జాతీయ విధానం తీసుకురావాలని కేంద్ర కార్మిక  శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఈఎస్‌‌‌‌ఐ ఉన్నతాధికారులను కోరారు.  

హైదరాబాద్‌‌‌‌లోని సనత్ నగర్ ఈఎస్‌‌‌‌ఐ ఆసుపత్రిలో రూ.211 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన అత్యాధునిక ఓపీడీ భవనాన్ని కేంద్ర మంత్రితో మన్సుఖ్‌‌‌‌ మాండవీయతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.668 కోట్ల వ్యయంతో పూర్తయిన మరికొన్ని ఈఎస్‌‌‌‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు కూడా వర్చువల్‌‌‌‌గా ప్రారంభోత్సవం చేశారు.

ఈ కొత్త ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 53 లక్షల మంది శ్రామికులకు ప్రయోజనం చేకూరనుంది.  తెలంగాణలోని 12.30 లక్షల మంది బీమా పొందిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు మరింత సులభంగా లభించనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘‘గతంలో నా తండ్రి జీ వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో నేను ఈ సనత్‌‌‌‌నగర్ ఆసుపత్రిని సందర్శించా. మళ్లీ ఇన్నాళ్లకు నేను రాష్ట్ర కార్మిక మంత్రిగా ఇక్కడికి వచ్చి చూస్తే.. నాటికీ నేటికీ ఎంతో అద్భుతమైన మార్పు కనిపిస్తోంది. ఇక్కడ పూర్తిస్థాయి కార్డియాక్ సెంటర్, బైపాస్ సర్జరీలు, అత్యుత్తమ డయాలసిస్ యూనిట్, క్యాన్సర్ రోగులకు లేటెస్ట్ థెరపీలు అందించడం ఆశ్చర్యానికి గురిచేసింది.  ఇప్పుడే సభలో ఒక కార్మికుడి బిడ్డకు రూ. 10 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ (వినే పరికరం) కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందించడం నా హృదయాన్ని కదిలించింది. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్‌‌‌‌ఐ ఎంతలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం” అని అన్నారు.

వరంగల్‌‌‌‌లో మరో ఈఎస్​ఐ.. రామగుండంలో 100 పడకలతో..

సనత్‌‌‌‌నగర్ ఈఎస్‌‌‌‌ఐ ప్రధాన కేంద్రం కావడంతో ఇక్కడ ఎప్పుడూ రోగులతో ఓవర్‌‌‌‌ఫ్లో అవుతోందని, ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ‘‘గత వారం నేను రామచంద్రాపురం ఈఎస్‌‌‌‌ఐ ఆసుపత్రికి వెళ్లాను. సనత్‌‌‌‌నగర్ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోవడంతో, ఇప్పుడు రాష్ట్రంలోని రామచంద్రాపురం అత్యంత రద్దీగా ఉండే పారిశ్రామిక హబ్‌‌‌‌గా మారింది.  అక్కడ వెంటనే కార్డియాక్ సెంటర్‌‌‌‌తో పాటు 20 పడకల డయాలసిస్ యూనిట్ మంజూరు చేయాలి. నాచారం ఆసుపత్రికి కార్డియాక్ కేంద్రం మంజూరైనా, అక్కడ కూడా 20 పడకల డయాలసిస్ యూనిట్ అత్యంత అవసరం. ఈ రెండు ప్రాంతాల్లో వసతులు పెంచితే సనత్‌‌‌‌నగర్‌‌‌‌పై ఒత్తిడి సగం తగ్గుతుంది” అని తెలిపారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కార్మికులకు వైద్యం అందాలంటే 3 నూతన ఆసుపత్రులు వెంటనే మంజూరు చేయాలని మంత్రి వివేక్ కోరారు.

‘‘శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఈఎస్‌‌‌‌ఐ ఆసుపత్రికి రాష్ట్ర కేబినెట్ స్థలం కేటాయించింది. ఆ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి. అలాగే హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ అయిన రామగుండంలో 100 పడకల ఆసుపత్రి అత్యంత అవసరం. దీనిపై ఉదయం మా పెద్దపల్లి ఎంపీ కూడా మీతో మాట్లాడారు. నేను కూడా అదే నియోజకవర్గం నుంచి వచ్చినవాడిని. అక్కడ ఆసుపత్రికి మంజూరు లభించి టెండర్లు పిలిచాక ఏవో కారణాలతో రద్దయింది. దయచేసి మళ్లీ టెండర్లు పిలిచి ఆసుపత్రి నిర్మించాలి. వీటితో పాటు మేడ్చల్ శివారు ప్రాంతంలో ఒకటి, భవిష్యత్తులో వరంగల్‌‌‌‌లో మరో ఆసుపత్రి ఏర్పాటు చేస్తే రాష్ట్రం అంతటా మెరుగైన నెట్‌‌‌‌వర్క్ ఏర్పడుతుంది” అని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా 73 ఈఎస్‌‌‌‌ఐ డిస్పెన్సరీలు ఉండగా, స్థల లభ్యత లేని కారణంగా గతంలో 15 డిస్పెన్సరీలు రద్దయ్యాయని మంత్రి వివేక్‌‌‌‌ గుర్తుచేశారు. ఆ 15 డిస్పెన్సరీలను తిరిగి మంజూరు చేయాలని కోరారు. 


కార్మిక వైద్య సేవలను మరింత ఆధునీకరిస్తున్నం: మన్సుఖ్‌‌‌‌ మాండవీయ 

కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని  మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం 94 శాతానికిపైగా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత  కవరేజీని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. గతంలో ఉన్న 29 సంక్లిష్టమైన లేబర్ కోడ్‌‌‌‌లను కార్మికులకు అనుకూలమైన 4  లేబర్ కోడ్‌‌‌‌లుగా సరళీకరించామని తెలిపారు. అలాగే, 40 ఏండ్లు పైబడిన కార్మికులందరికీ ఏటా సమగ్ర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు.

దీంతో గుండె జబ్బులు, రక్తనాళాల్లో బ్లాక్‌‌‌‌లు  లేదా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌లాంటి వ్యాధులను ప్రాథమిక లేదా మొదటి దశలోనే   గుర్తించి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. ఐటీ, ఇతర రంగాల అభివృద్దికి తగ్గట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల ప్రయోజనాలకు, వారికి పూర్తి గ్యారెంటీ కల్పిస్తూ కొత్త విధానాలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.  దేశవ్యాప్తంగా కార్మిక వైద్య సేవలను మరింత ఆధునీకరిస్తున్నామన్నారు.  మంత్రి వివేక్​ చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. రామగుండం పనులకు సంబంధించిన సాంకేతిక అడ్డంకులను తొలగించి, త్వరితగతిన మళ్లీ టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. గతంలో ల్యాండ్ అలాట్‌‌‌‌మెంట్ సమస్యల వల్ల రద్దయిన 15 ఈఎస్‌‌‌‌ఐ డిస్పెన్సరీలను మళ్లీ మంజూరు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించి, ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేంద్రం నుంచి వీటికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.