- తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల టీచర్ల సంఘాలు, ఎంపీల మద్దతు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే టీచర్లకు టెట్ ఉత్తీర్ణత నిబంధనను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆలిండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఏఐజేఏసీటీఓ) ఆరోపించింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆర్టీఈ చట్టాన్ని సవరించి, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతను కాపాడాలని డిమాండ్ చేసింది. గురువారం ఏఐజేఏసీటీఓ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీచర్లు భారీ ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాకు సీఎన్ భారతి (ఎస్టీఎఫ్‌ఐ), కె.నరసింహారెడ్డి (ఏఐఎస్‌టీఎఫ్), బసవరాజ్ గురికర్ (ఏఐపీటీఎఫ్), సీఎల్ రోజ్ (ఏఐఎఫ్‌టీఓ)లతో కూడిన బృందం అధ్యక్షత వహించింది. ఎంపీలు జాన్ బ్రిట్టాస్, సెల్వరాజ్, వి.శివదాసన్, కుమార్ నాయక్, రాజారామ్ సింగ్ హాజరై సంఘీభావం తెలిపారు. ఎంపీలు మాట్లాడుతూ.. టీచర్ల గొంతుకను పార్లమెంట్‌లో వినిపిస్తామని హామీ ఇచ్చారు.
సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, తెలంగాణలతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల విద్యా రంగానికి చెందిన అన్ని జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటాన్ని ప్రారంభించడం చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. 1వ తరగతి నుంచి 8 తరగతుల వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు, ఐదేండ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేండ్లలోపు టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను వారు వ్యతిరేకించారు. అలాగే ఓపీఎస్, ఎన్‌ఈపీ 2020 ఉపసంహరణ, స్కూళ్ల విలీనం నిలిపివేత తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐజేసీటీఓ డిమాండ్ చేసింది.
