సర్కారు బడుల కుదింపు ఆలోచన మానుకోవాలి..సీఎం ప్రకటనపై టీపీటీఎఫ్, డీటీఎఫ్ సంఘాల ఆగ్రహం 

సర్కారు బడుల కుదింపు ఆలోచన మానుకోవాలి..సీఎం ప్రకటనపై టీపీటీఎఫ్, డీటీఎఫ్ సంఘాల ఆగ్రహం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ బడులను 4 వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను టీపీటీఎఫ్​, డీటీఎఫ్ సంఘాలు  తప్పుపట్టాయి. హేతుబద్ధీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లోని బడులను మూసివేస్తే పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ విద్యనందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం సరికాదని, కార్పొరేట్ శక్తులకు విద్యావ్యాపారాన్ని కట్టబెట్టేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను తుంగలో తొక్కి తిరోగమన విధానాలను అవలంబిస్తోందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి విమర్శించారు.

అధికారంలోకి వస్తే ఒక్క బడిని కూడా మూసివేయబోమని, బడ్జెట్‌‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. బడుల కుదింపు ప్రక్రియ చేపడితే ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా కనుమరుగైపోతుందని చెప్పారు. ఇప్పటికైనా విద్యారంగానికి బడ్జెట్‌‌లో అధిక నిధులు కేటాయించి, ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరారు.