V6 News

98 వేల కోట్లతో రోడ్ల నెట్వర్క్..2028 కల్లా అత్యుత్తమ రహదారులున్న రాష్ట్రంగా తెలంగాణ: భట్టి, కోమటి రెడ్డి

98 వేల కోట్లతో రోడ్ల నెట్వర్క్..2028 కల్లా అత్యుత్తమ రహదారులున్న రాష్ట్రంగా తెలంగాణ: భట్టి, కోమటి రెడ్డి
  • వచ్చే నవంబర్​లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ‘ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌’
  •     పట్టాలెక్కనున్న ట్రిపుల్ ఆర్​ బుల్లెట్ ట్రెయిన్.. గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ రహదారులు
  •     సచివాలయంలో రహదారుల అభివృద్ధిపై సమీక్ష  

హైదరాబాద్, వెలుగు: రూ.98 వేల కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రహదారులున్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బుధవారం సచివాలయంలో రహదారుల అభివృద్ధిపై నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం రహదారుల రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించబోతోందని.. అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచేలా 2026 నవంబర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో ‘ఇండియన్ రోడ్ కాంగ్రెస్’ 84వ వార్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తనకున్న వ్యక్తిగత పరిచయం ద్వారా, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఈ సదస్సును హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రప్పించగలిగామని ఆయన వివరించారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రానికి రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఐఆర్‌‌‌‌‌‌‌‌సీ అధ్యక్షుడిగా మన రాష్ట్రానికి చెందిన మోహన్ నాయక్ ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

ట్రిపుల్ ​ఆర్​ ప్రాజెక్టు రాష్ట్రానికి ‘గేమ్ ఛేంజర్’

 రూ.36 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ట్రిపుల్​ఆర్​ప్రాజెక్టు రాష్ట్రానికి ‘గేమ్ ఛేంజర్’ కానుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ట్రిపుల్​ఆర్​ఉత్తర భాగం భూసేకరణ కోసం రాష్ట్ర వాటాగా రూ.628 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ)కు జమ చేసినట్టు వెల్లడించారు. అలాగే, రూ.20 వేల కోట్లతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లుగా (ఆరు ప్రధాన లైన్లు, రెండు సర్వీస్ లైన్లు) విస్తరిస్తున్నామని, ఇందుకోసం రూ.500 కోట్లతో ఫ్లైఓవర్లు, బ్లాక్ స్పాట్ల తొలగింపు చేపట్టనున్నట్టు తెలిపారు. 

ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి- బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను కూడా ఖరారు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు. పర్యావరణ హితంగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.8 వేల  కోట్లు కేటాయించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. 

 148 కోట్లతో  అప్రోచ్ రోడ్ల నిర్మాణం 

రాష్ట్రంలో మూడేండ్ల క్రితం వంతెనల నిర్మాణం పూర్తయిన అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.148 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.  సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన ‘ఇన్​ఫ్రాస్ట్రక్చర్​క్యాపిటల్ వర్క్స్’ కేబినెట్​సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వంతెనలు ఉండి రోడ్లు లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన సబ్ కమిటీ.. 300 గ్రామాలకు లబ్ధి చేకూరేలా ఈ నిధులను మంజూరు చేసింది.