V6 News

ఇలా ఉన్నారేంట్రా.. చీర బదులు నైటీ ధరించిందని భార్యకు నిప్పంటించేశాడు !

ఇలా ఉన్నారేంట్రా.. చీర బదులు నైటీ ధరించిందని భార్యకు నిప్పంటించేశాడు !

బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో భార్య నైటీ ధరించిందని గొడవ పడి ఆమెకు భర్త నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఏప్రిల్ 19న బెళగావి జిల్లాలోని ఖానాపూర్ తాలూకా నంద్‌గడ్ గ్రామంలో జరిగింది. నిందితుడు కృష్ణ పాటిల్ (29), తన భార్య మంజులా పాటిల్ (27) ఇంట్లో చీరకు బదులుగా నైట్‌డ్రెస్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీరిద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. నైటీ తీసేసి చీర కట్టుకోకపోతే.. నైటీతో సహా తననూ తగలబెడతానని కృష్ణ బెదిరించాడు.

దీంతో.. గొడవ మరింత ముదిరింది. ఇంట్లో ఉన్నప్పుడు నైటీ ధరిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించింది. నైటీ మార్చుకునేందుకు నిరాకరించింది. దీంతో.. తను చెప్పిన మాట వినలేదని క్షణికావేశంలో కృష్ణ ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాధితురాలు మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మొదట బెళగావి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ ఆమెకు సుమారు 80 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను తర్వాత గోవాలోని ఒక ఆసుపత్రికి తరలించారు.

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు తెలిపారు. కృష్ణ, మంజులకు పెళ్లై ఎనిమిది సంవత్సరాలు అయింది. ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. బాధితురాలి తండ్రి తన అల్లుడు పెళ్లయినప్పటి నుంచి తన కూతురు మంజులను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని నందగడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ALSO READ : తల్లిని, భార్యను చంపి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

మంజులను చంపే ఉద్దేశ్యంతోనే కృష్ణ ఆమెకు నిప్పంటించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఏప్రిల్ 20న నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించడంతో వైద్య పరీక్షలు నిర్వహించి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.