భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (Varanasi). ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు, హాలీవుడ్ స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించడమే లక్ష్యంగా జక్కన్న మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
మెక్సికోలో 'వారణాసి' గర్జన..
లాటిన్ అమెరికాలో జరిగే అతిపెద్ద పాప్ కల్చర్ ఈవెంట్ CCXP మెక్సికో 2026 వేదికగా 'వారణాసి' తన ప్రపంచ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతోంది. ఏప్రిల్ 24న ప్రతిష్టాత్మకమైన 'థండర్ స్టేజ్'పై ఈ చిత్రానికి సంబంధించిన భారీ ప్రెజెంటేషన్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌లో సినిమాలోని ఐమాక్స్ (IMAX) వెర్షన్ ప్రివ్యూతో పాటు, మునుపెన్నడూ చూడని బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఎస్ ఎస్ కార్తికేయ అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాజమౌళి నేరుగా హాజరు కాకపోయినా, ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా గ్లోబల్ ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఎస్.ఎస్. కార్తికేయ స్వయంగా ఈ ఈవెంట్‌లో పాల్గొని సినిమా విశేషాలను పంచుకోనున్నారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్..
దాదాపు రూ. 1,200 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారణాసి ఘాట్ల నేపథ్యంలో ఒక శివ భక్తుడు శక్తివంతమైన విశ్వ రహస్యాన్ని ఛేదించేందుకు చేసే 'టైమ్ ట్రావెల్' ప్రయాణమే ఈ సినిమా అని సమాచారం. మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, సినిమాను అత్యున్నత ప్రమాణాలతో కూడిన ట్రూ ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు.
ALSO READ : అనిల్ రావిపూడి సినిమాలో షాకింగ్ కాంబినేషన్..
పారిస్ ట్రైలర్ ఫెస్టివల్‌లో ఇప్పటికే సంచలనం సృష్టించిన 'వారణాసి', ఇప్పుడు మెక్సికో ఈవెంట్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం, భారతీయ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వారణాసి ఆధ్యాత్మికతకు, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి రాజమౌళి ఏ స్థాయి వండర్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి..

