V6 News

మంచిర్యాల జిల్లాలో దారుణం..మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

మంచిర్యాల జిల్లాలో దారుణం..మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలో మూఢనమ్మకం మనిషి ప్రాణాన్ని తీసింది. మంత్రాల నెపంతో సాటి మనిషిని కిరాతకంగా అంతం చేసేలా ప్రేరేపించింది. 

వివరాల్లోకి వెళ్తే.. బెజ్జాల గ్రామానికి చెందిన గుమ్ముల రాజం అనే వ్యక్తి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. భక్తి భావం కలిగిన రాజం, నిత్యం గ్రామ సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. అయితే నిన్న ఎప్పటిలాగే ఆలయానికి వెళ్లిన రాజం.. చీకటి పడినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. రాజం కోసం వెతుకుతూ కుటుంబ సభ్యులు గోదావరి తీరానికి చేరుకున్నారు.  రాజం ద్విచక్ర వాహనం రక్తపు మడుగుల్లో ఉండటం గుర్తించారు.  వెంటనే బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న జైపూర్ సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాజం తమ కుటుంబంలో అనారోగ్యాలకు, గొడవలకు మంత్రాలతో కారణమవుతున్నాడనే మూఢనమ్మకంతోనే అతడిని హత్య చేసినట్లు తేలింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గోదావరి సమీపంలోని ఒక కాలువలో పడేసిన రాజం మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా.. గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడి సమీప బంధువైన వెంకటి కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారని, తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. కళ్లముందే తిరిగే బంధువులే మూఢనమ్మకంతో ఒక ప్రాణాన్ని బలిగొనడం బెజ్జాల గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.