V6 News

ఇవాళ(ఏప్రిల్ 23) తెలంగాణ కేబినెట్ మీటింగ్‌

ఇవాళ(ఏప్రిల్ 23) తెలంగాణ కేబినెట్ మీటింగ్‌


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కాళేశ్వరంపై జస్టిస్​ పీసీ ఘోష్​ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్​పై చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున.. డిమాండ్ల పరిష్కారంపై ఏం చేయాలనే దానిపైనా మంత్రివర్గంలో చర్చిస్తారు. మెట్రో టేకోవర్​కు సంబంధించి రూ.13 వేల కోట్లకు రుణం మంజూరు కాగా.. ఈ నెలాఖరు కల్లా పూర్తిగా ప్రభుత్వం హ్యాండోవర్​ చేసుకోవడంపై కేబినెట్​గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వనుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, భూముల మార్కెట్​వాల్యూ సవరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

ఘోష్​​ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్​రావుతో పాటు పలువురు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న కోర్టు తీర్పుపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఇప్పటికే న్యాయ నిపుణుల అభిప్రాయం కోరారు. కేబినెట్​లో దానిపై చర్చించనున్నారు. హైకోర్టులోనే డివిజన్ బెంచ్ కు వెళ్లడం.. లేదా సుప్రీంకోర్టులో ఎస్​ఎల్​పీ వేయడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇంకోవైపు ఏదైతే ప్రొసిజర్ ల్యాప్స్​ ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించిందో దానికి సంబంధించి మళ్లీ కమిషన్​ను పునరుద్ధరించి సరి చేయడంపైనా ఆలోచన చేస్తున్నది. వీటన్నింటిపై కేబినెట్​లో మంత్రులందరితో చర్చించి సీఎం ముందుకు వెళ్లనున్నారు. అదే సమయంలో కాళేశ్వరంపై సీబీఐ కేసు నమోదు చేయకపోవడాన్ని ఏ రకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే దానిపై కార్యాచరణతో పాటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి చర్చించనున్నారు. జనగణన అంశం కూడా కేబినెట్​లో చర్చకు రానుంది. ఇటీవల రిలీజ్​ చేసిన సీపెక్​ సర్వే కు సంబంధిచిన ఇండిపెండెంట్​ఎక్స్​పర్ట్​ కమిటీ రిపోర్ట్​ పైనా చర్చించనున్నారు. వాటికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది.