- తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ ప్రశ్న
ఉప్పల్, వెలుగు: హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్‌ను వ్యాపారంగా మార్చుతూ బ్లాక్ టికెట్ల దందా నడిపిస్తున్నారని తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ మండిపడింది. అసోసియేషన్ ప్రతినిధులు మేడి పాపయ్య మాదిగతో పాటు పలు సంఘాల నాయకులు శుక్రవారం ఉప్పల్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల దందా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
టికెట్ల కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే నిమిషాల్లోనే ‘సోల్డ్ అవుట్’ చూపించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు విక్రయించడం అభిమానులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పేరుతో జట్టు నడుపుతూ ఐపీఎల్‌లో తెలంగాణ ఆటగాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ప్రేమను ఉపయోగించుకుని చివరికి వారినే అవమానిస్తున్నారని విమర్శించారు.
ఈ నెల 15న కుల సంఘాలు, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు కలిసి ఎస్‌ఆర్‌హెచ్ ఇన్చార్జి జెమిని కిరణ్‌ను టికెట్ల దందాపై ప్రశ్నించేందుకు వెళ్లగా అతని అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయడాన్ని వారు తప్పుబట్టారు. పోలీసులు కూడా ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికే మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. సీఎం, ఉన్నతాధికారులు విచారణ జరిపించి జెమిని కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
