- విస్తృతంగా ఫామ్ పాండ్స్‌ను నిర్మించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రైతులు వరి మినహా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. శుక్రవారం ఎల్-నినో, స్కూల్ యూనిఫామ్‌ల పంపిణీపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఎల్-నినో ప్రభావం తెలంగాణపైనే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో 27 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా, 385 మండలాల్లో వర్షాభావం ఉందన్నారు. వాతావరణ వివరాలను రైతులకు వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు లేవని, రిజర్వాయర్ల నీరు తాగునీటికే కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు వరి సాగు 24 శాతం కంటే తక్కువైందని, సెప్టెంబర్‌లోనూ వర్షాలు తక్కువే ఉంటాయని ఐఎండీ చెప్పినట్లు వెల్లడించారు. ఫామ్ పాండ్స్ నిర్మాణం విస్తృతం చేయాలని, ప్రతి 45 రోజులకోసారి మండల సమావేశాలు జరపాలన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు చెరో రెండు యూనిఫామ్‌లు అందించాలని, కమిటీలతో పర్యవేక్షించాలని ఆదేశించారు.
