డ్రగ్స్‌‌‌‌ సప్లయర్ల ఆస్తులు జప్తు..సఫెమా చట్టాన్ని ప్రయోగిస్తున్న అధికారులు

డ్రగ్స్‌‌‌‌ సప్లయర్ల ఆస్తులు జప్తు..సఫెమా చట్టాన్ని ప్రయోగిస్తున్న అధికారులు
  •     రెండేండ్లలో 32 కేసుల్లో ఆస్తులు స్వాధీనం చేస్కున్న ఈగల్ ఫోర్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌‌‌‌ను సమూలంగా అరికట్టేందుకు ఈగల్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ పక్కా ప్లాన్‌‌‌‌తో ముందుకెళ్తోంది. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఇందుకు స్మగ్లింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫారిన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ఛేంజ్‌‌‌‌ మానిప్యులేటర్స్‌‌‌‌(సఫెమా) యాక్ట్‌‌‌‌ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రెండేండ్లలో 32 కేసుల్లో నిందితుల ఆస్తులను జప్తు చేసింది.

దందాతో కూడబెట్టిన ఆస్తుల గుర్తింపు..

నిందితులు ఎంతకాలంగా గంజాయి, డ్రగ్స్‌‌‌‌ సరఫరా చేస్తున్నారు? ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ కింద ఎన్నిసార్లు జైలుకు వెళ్లారు? అనే వివరాలను ఈగల్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ అధికారులు సేకరిస్తున్నారు. దందాకు ముందు, ఆ తర్వాత వారి ఆస్తుల్లో వచ్చిన మార్పులపై ఆరా తీస్తున్నారు. డ్రగ్స్‌‌‌‌ ద్వారా సంపాదించిన డబ్బుతో కూడబెట్టిన ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న స్థిర, చరాస్తుల వివరాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ఆస్తులను సీజ్‌‌‌‌ చేసి కోర్టులకు సమర్పిస్తున్నారు. స్థానిక కోర్టుల అనుమతితో సఫెమా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

సఫెమా అథారిటీకి నివేదికలు..

సఫెమా యాక్ట్‌‌‌‌ ప్రకారం మాదకద్రవ్యాల సరఫరాతో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన భూములు, భవనాలు, ఖరీదైన కార్లు, పెట్టుబడులు తదితరాలను జప్తు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలతో పాటు నిందితుల పేరిట ఉన్న ఆస్తుల పూర్తి వివరాలను ఈగల్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ అధికారులు చెన్నైలోని ‘సౌత్‌‌‌‌ ఇండియా సఫెమా కాంపిటెంట్‌‌‌‌ అథారిటీ’కి పంపుతున్నారు. నిందితులకు నోటీసులు జారీ చేసి అథారిటీ విచారణ చేపడుతోంది. 

రిపీట్‌‌‌‌ నిందితులపై పీఐటీ ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌..

మాదకద్రవ్యాల విక్రయాలు, సరఫరా ద్వారా ఆస్తులు సంపాదించినట్లు తేలితే వాటిని జప్తు చేయాలని అథారిటీ ఆదేశాలు ఇస్తోంది. పదేపదే డ్రగ్స్‌‌‌‌ దందాలో పట్టుబడుతున్న పెడ్లర్లపై పీడీ యాక్ట్‌‌‌‌ తరహాలో పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం ‘ప్రివెన్షన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇల్లిసిట్‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌ ఇన్‌‌‌‌ నార్కోటిక్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ సైకోట్రోపిక్‌‌‌‌ సబ్‌‌‌‌స్టాన్సెస్‌‌‌‌’(పీఐటీ ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌) యాక్ట్‌‌‌‌ను ప్రయోగిస్తున్నారు. ఈ చట్టాల కింద రెండేండ్ల వరకు బెయిల్‌‌‌‌ లభించని పరిస్థితి ఉంటుంది. ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ కింద జైలు శిక్షలు, సఫెమా కింద అక్రమంగా సంపాదించిన ఆస్తుల జప్తుతో డ్రగ్స్‌‌‌‌ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు.