- ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థిరమైన, సమ్మిళిత, ఆధునిక పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్-హాబిటాట్‌తో మున్సిపల్ పరిపాలన శాఖ ఫ్రేమ్‌వర్క్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి, యూఎన్-హాబిటాట్ ప్రాంతీయ డైరెక్టర్ పాట్రిక్ కనగసింగం గురువారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (నియుమ్) పట్టణ ఆవిష్కరణలు, సామర్థ్య పెంపునకు ప్రధాన వేదికగా వ్యవహరించనుంది.
వాతావరణ మార్పులను తట్టుకునే పట్టణాభివృద్ధి, అధునాతన మౌలిక సదుపాయాలు, తాగునీరు, మురుగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించనున్నారు. చిన్న, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థానిక సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక పరిష్కారాలను అందించనున్నారు. ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థల్లో ల్యాబొరేటరీ విధానాన్ని అమలు చేయనున్నారు.
వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత నియంత్రణ, వర్షపు నీటి నిర్వహణ వంటి అంశాల్లో వినూత్న పద్ధతులను ప్రయోగాత్మకంగా పరీక్షించి, విజయవంతమైన నమూనాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌కు దోహదపడుతుందని శ్రీదేవి తెలిపారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
