రాష్ట్రానికి పెనుభారంగా కాళేశ్వరం..హైకోర్టులో ప్రభుత్వం వాదనలు

రాష్ట్రానికి పెనుభారంగా కాళేశ్వరం..హైకోర్టులో ప్రభుత్వం వాదనలు
  • విచారణ కోసం కమిషన్‌‌ ఏర్పాటు చేసినపుడు ఎవరూ ప్రశ్నించలే
  • నివేదిక వచ్చాక సవాల్​చేస్తున్నారు ..హైకోర్టులో ప్రభుత్వం వాదనలు
  • విచారణ ఈ నెల 19కి వాయిదా 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు వెచ్చించిన వ్యయానికి, వచ్చే ఆదాయానికి పొంతన లేదని, ఇది గిట్టుబాటు ప్రాజెక్టు కాదంటూ కాగ్‌‌ నివేదిక బట్టబయలు చేసిందని ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్‌‌ పి.సి.ఘోష్‌‌ కమిషన్‌‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో నం.6ను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌రావు, ఐఏఎస్‌‌ స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్‌‌ ఎస్‌‌.కె.జోషి దాఖలు చేసిన పిటిషన్‌‌లపై చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌లతో కూడిన బెంచ్‌‌ గురువారం విచారణ చేపట్టింది. 

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డి మంగళవారం వాదనలు వినిపిస్తూ రూ.81.911 వేల కోట్ల ప్రాజెక్టు కాస్త రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2022లో ప్రాజెక్టు వ్యయం రూ.86,788 కోట్లకాగా అందులో బడ్జెట్‌‌కు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లిమిటెడ్‌‌ రూ.55,807 కోట్లు రుణాల ద్వారా ఖర్చు పెట్టిందన్నారు. అంటే ఇది ప్రాజెక్టు ఖర్చులో 64 శాతానికిపైగా ఉందన్నారు. కమిషన్‌‌ విచారణ తీరు ఎలా జరుగుతుందో పిటిషనర్లకు తెలుసని తెలిపారు. 

పిటిషనర్‌‌కు 8బీ, సీ నోటీసుల గురించి అవగాహన ఉందన్నారు. కమిషన్‌‌ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాక అసెంబ్లీలో దానిపై చర్చ జరిగిందన్నారు. అనంతరం దర్యాప్తు జరపాలంటూ సీబీఐని కోరుతూ ప్రభుత్వం జీవో నం.104 జారీ చేసిందని తెలిపారు. 

ప్రాజెక్టు వ్యవహారాల్లో ముఖ్యమంత్రికి సహాయకారిగా ఉన్న ఐఏఎస్‌‌ అధికారి స్మితా సభర్వాల్‌‌ బిజినెస్‌‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం తరఫున సీనియర్‌‌ న్యాయవాది శ్రీరఘురాం నివేదించారు. ఆమె రాకముందు కమిషన్ 95 మందిని విచారించిందని, మొత్తం మీద 119 మందిని విచారించిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు అనుమతిస్తూ ఆమె జారీ చేసిన జీవోలను మంత్రి మండలి ముందుంచలేదని తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్‌‌ ఘోష్‌‌ కమిషన్‌‌ కేవలం మాజీ ఐఏఎస్‌‌ ఎస్‌‌.కె.జోషిని ఒక్కరినే కాకుండా ఆ సమయంలో ఉన్న అధికారులందరినీ విచారించిందంటూ ప్రభుత్వం తరఫున సీనియర్‌‌ న్యాయవాది ఎస్‌‌.నిరంజన్‌‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో భాగస్వామ్యం ఉన్న 11 మంది అధికారులను విచారించిందన్నారు. 

నిపుణుల కమిటీ మేడిగడ్డలో బ్యారేజీ వద్దని చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. విచారణ నిమిత్తం కమిషన్‌‌ ఏర్పాటు చేసినపుడు ఎవరూ ప్రశ్నించలేదని, నివేదిక వచ్చాక జీవో నం.6ను సవాలు చేశారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్ల సమాధానం కోసం విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.