టీచర్ల అలాట్‌‌మెంట్‌‌లో సర్కారు ఇష్టారాజ్యం

టీచర్ల అలాట్‌‌మెంట్‌‌లో సర్కారు ఇష్టారాజ్యం


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్లను కొత్త జిల్లాలకు అలాట్ చేసే విషయంలో రాష్ట్ర సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సీనియారిటీ లిస్టు మొదలుకొని, అలాట్‌‌మెంట్ దాకా అనేక తప్పిదాలను టీచర్లు ఎత్తిచూపుతున్నా.. వాటిని పట్టించుకుంటలేదు. జిల్లా కేంద్రాలు, వాటికి దగ్గర్లోని స్కూళ్లలో ఖాళీలను బ్లాక్ చేసింది. కేవలం జిల్లా హెడ్‌‌క్వార్టర్స్‌‌కు దూరంగా ఉన్న స్కూళ్లలో మాత్రమే పోస్టులను చూపుతోంది. మరోవైపు కౌన్సెలింగ్‌‌ను కూడా రద్దు చేసింది. సర్కారు తీరుతో టీచర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలే

రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 95,877 మంది టీచర్లు జిల్లా కేడర్ పరిధిలో పనిచేస్తున్నారు. జీవో నంబర్ 317 ప్రకారం 22,572 మంది టీచర్లు వివిధ జిల్లాల్లోకి మారారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోకి 1,603 మంది, హనుమకొండకు 1,126 మంది, కరీంనగర్‌‌‌‌కు 1,131 మంది, వరంగల్‌‌కు 1,036 మంది, మహబూబ్​నగర్‌‌‌‌కు వెయ్యి మందిని కేటాయించారు. అత్యల్పంగా గద్వాల జిల్లాకు 281 మంది, నిర్మల్​కు 302 మంది, సూర్యాపేటకు 333 మంది, ఆదిలాబాద్ జిల్లాకు 333 మంది అలాటయ్యారు. కొత్త జిల్లాలకు అలాట్‌‌మెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క అంశంపైనా సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. సీనియారిటీ లిస్టులు తప్పుల తడకగా ఉన్నా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సరిచేయలేదు. సీనియారిటీ జాబితాలను ఒక్కో జిల్లా ఒక్కోలా తయారు చేసింది. ఈ విషయంపై సర్కారుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అలాట్‌‌మెంట్ అయ్యాక సరిచేద్దామంటూ ఉచిత సలహా ఇస్తూ వచ్చారు. చివరికి అలాట్‌‌మెంట్ విషయంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.

రూల్స్ మొత్తం మార్చేసి..

సాధారణంగా కౌన్సెలింగ్ టైమ్‌‌లో జిల్లాలో మొత్తం ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూపించి, తర్వాత ఆప్షన్లు తీసుకుంటారు. రాష్ట్ర సర్కారు మాత్రం ఈ రూల్‌‌ను మార్చేసింది. జిల్లా నుంచి ఎంతమంది వెళ్లిపోయారో ఆ పోస్టులనూ ఖాళీలుగా చూపించడం లేదు. కొత్తగా జిల్లాకు ఎంతమంది అలాట్ అయ్యారో, ఆ సంఖ్య మాత్రమే ఖాళీలుగా చూపిస్తున్నారు. ఉదాహరణకు నాగర్ కర్నూల్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పోస్టులు 41 ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లాకు కొత్తగా 18 మంది అలాటయ్యారు. దీంతో అధికారులు కేవలం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసిన స్కూళ్లలోని 18 ఖాళీ పోస్టుల వివరాలను కౌన్సెలింగ్‌‌లో చూపించారు. ఆ ఖాళీల్లోనే వారిని భర్తీ చేస్తారు. జిల్లాలోని మిగిలిన స్కూళ్లలోని ఖాళీలను బ్లాక్ చేశారు. కరీంనగర్ జిల్లాలో లాంగ్వేజీ పండిట్ తెలుగు కేటగిరీలో 193 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి 116 మందిరాగా,  కౌన్సెలింగ్‌‌లో  కూడా ఈ పోస్టులే  ఖాళీగా ఉన్నట్టు చూపించారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే కొనసాగుతోంది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లోని స్కూళ్లలోని ఖాళీలనే చూపిస్తున్నారు. ఏ జిల్లాలోనూ జిల్లా హెడ్ క్వార్టర్​లోని స్కూల్స్​లో ఒక్క పోస్టు కూడా చూపించడంలేదు.  జిల్లాలు మారి వచ్చిన టీచర్లను ఈ విధానం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద అన్ని ఖాళీ పోస్టులను కౌన్సెలింగ్​కు చూపించాలని టీచర్లు ఆందోళనలు నిర్వహించారు. కానీ సర్కారులో మాత్రం చలనం రాలేదు.

ఆన్​లైన్‌‌లో పోస్టింగ్ వివరాలు పంపిస్తరట

కొత్త జిల్లాలకు అలాటైన 22,572 మంది టీచర్లకు పోస్టింగ్‌‌లు ఇచ్చేందుకు సర్కారు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇచ్చింది. దీని ప్రకారం 30న అలాట్‌‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇప్పటికే పలు జిల్లాల్లో టీచర్ల నుంచి ఆప్షన్ ఫామ్స్‌‌ తీసుకున్నారు. మంగళ, బుధవారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కౌన్సెలింగ్​లో చూపించాలని టీచర్లు ఆందోళనలు చేస్తున్నారు. కానీ సర్కారు ఇదేమీ పట్టించుకోకుండా కౌన్సెలింగ్ రద్దు చేయాలని సోమవారం రాత్రి కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. దీంతో ఆప్షన్ ఫామ్స్‌‌ ఇవ్వాలని, ఆన్​లైన్​లో పోస్టింగ్ వివరాలు పంపిస్తామని టీచర్లకు డీఈఓలు అప్పటికప్పుడు మెసేజ్‌‌లు పంపించారు. మంగళవారం మధ్యాహ్నం లోపు ఆప్షన్ ఫామ్స్‌‌ ఇవ్వాలని, లేకపోతే సర్కారు రూల్స్ ప్రకారం పోస్టింగ్స్‌‌ ఇస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఎస్జీటీ లాంటి పోస్టులు వందల ఖాళీలు ఉంటాయి. ఒక్కో టీచర్ అన్ని ఆప్షన్లు ఎలా ఇస్తారని టీచర్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి.