- ప్రభుత్వ తీరే కారణం: కుటుంబ సభ్యులు
- ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన
మహబూబాబాద్, హైదరాబాద్, వెలుగు: పెరాలసిస్ వచ్చిందని, తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోలే.. స్పౌజ్ కేటగిరీలోనూ ప్రాధాన్యం ఇవ్వలే. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చిన్రు. ఈ బలవంతపు బదిలీ కారణంగా ఓ హెడ్‌మాస్టర్ గుండె ఆగింది. మహబూబాబాద్ జిల్లాలో గురువారం జరిగిందీ ఘటన. తమ తండ్రి మృతికి ప్రభుత్వమే కారణమంటూ హెచ్‌ఎం కొడుకులు ఆరోపించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలతోనే ఈ దుస్థితి వచ్చిందని టీచర్ యూనియన్లు మండిపడ్డాయి.
జిల్లా కలెక్టర్‌ను కలిసినా..
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర శివారు సంధ్యా తండాకు చెందిన బానోతు జేతురామ్నాయక్ (58).. 25 ఏళ్లపాటు ఎస్జీటీగా పని చేశారు. 2015లో చిన ముప్పారంలోని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ప్రమోషన్ పొందారు. బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రావుల స్కూల్‌కు పంపారు. అయితే గిరిజన ఉపాధ్యాయుల దామాషాను సక్రమంగా పాటించకుండా, రూల్స్‌కు విరుద్ధంగా ఆయనను ములుగు జిల్లాకు కేటాయించారని కుటుంబసభ్యులు చెప్పారు. కేటాయింపు ఉత్తర్వులు అందుకున్న తర్వాత ములుగు వెళ్లి రిపోర్ట్ చేసి వచ్చారని, ఆ తర్వాతి నుంచి తీవ్ర ఆవేదనకు గురయ్యారని జేతురామ్ భార్య పద్మ, కొడుకులు జయపాల్, బాలగోపాల్ చెప్పారు. పలుసార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసిన జేతురామ్.. టీచర్ యూనియన్లకు కూడా తన సమస్య చెప్పుకున్నారు. తన భార్య పద్మ అంగన్ వాడీ టీచర్ కావడంతో స్పౌజ్ కేటగిరీలోనైనా న్యాయం చేయాలని కోరారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురయ్యారు. గురువారం గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందారని డాక్టర్లు చెప్పారు. తమ తండ్రికి జులైలో పెరాలసిస్ వచ్చిందని,
ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోలేదని కొడుకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జేతురామ్ మృతి వార్త తెలుసుకుని టీచర్ యూనియన్ల నాయకులు హాస్పిటల్‌కు తరలివచ్చారు.
సర్కారే బాధ్యత వహించాలె: బండి సంజయ్
మహబూబాబాద్ జిల్లా చిన ముప్పారంలో గిరిజన టీచర్ జేతురామ్ నాయక్ మరణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జేతురామ్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రీఅలాట్‌మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే హెచ్ఎం మరణానికి కారణమని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
జీవో 317ను సవరించాలి
జీవో నంబర్ 317 సృష్టించిన అస్తవ్యస్త పరిస్థితి కారణంగానే హెచ్ఎం జేతురామ్నాయక్ చనిపోయారు. ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. జీవో నంబర్ 317ను సవరించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి.
- సూరం ఉపేందర్ రెడ్డి, టీపీటీఎఫ్జిల్లా జనరల్ సెక్రటరీ
