హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో రూ.10 కోట్లకుపైగా పనుల టెండర్లను ఫైనల్ చేసేందుకు కమిటీ ఆమోదం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పనుల గుర్తింపు, టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్డింగ్, టెండర్ కాలపరిమితి పెంచడంలో కూడా కమిటీదే తుది నిర్ణయమని డిసైడ్చేసింది. పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఈ కమిటీల్లో హెచ్ఎండీఏ, జలమండలి చీఫ్ ఇంజినీర్లకు కూడా అవకాశం కల్పించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ స్ట్రక్సన్(ఈపీసీ) కమిటీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ విభజనలో భాగంగా ఏర్పాటైన రెండు చోట్ల ప్రస్తుతం కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని ఈపీసీ పనులకు ఈ కొత్త కమిటీల విధానం వర్తించనుంది. టెండర్లను ఆమోదించే రెండో కమిటీలో అడిషనల్ కమిషనర్(పనులు)కు బదులు సంబంధిత సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)ని కన్వీనర్ గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
