పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా బదిలీలు

పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా బదిలీలు
  • 88 మందికి స్థానచలనం కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు
  • మూడు రోజుల్లోగా కొత్త జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియ ముగిసింది. జోన్ల పరిధిలో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం కల్పిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కల్పన శాఖ కమిషనర్ దివ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి మొత్తం 88 మందిని వివిధ జిల్లాలకు కేటాయించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. జోన్ల వారీగా అంతర్ జిల్లా బదిలీల కోసం ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ అనంతరం, సీనియారిటీ, నిబంధనల మేరకు అభ్యర్థులకు జిల్లాలను కేటాయించారు. జోన్-1 నుంచి జోన్-7 వరకు ఉన్న వివిధ జిల్లాల కార్యదర్శులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. బదిలీ అయిన వారిలో గ్రేడ్-1 నుంచి గ్రేడ్-3 స్థాయి అధికారులు ఉన్నారు.

బదిలీ ఉత్తర్వులు అందుకున్న పంచాయతీ కార్యదర్శులు తక్షణమే తమ ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ కావాలని కమిషనర్ ఆదేశించారు. ఉత్తర్వులు జారీ అయిన మూడు రోజుల్లోగా సంబంధిత కలెక్టర్ల వ‌‌ద్ద రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. కొత్తగా కేటాయించిన జిల్లాల్లో వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఈ బదిలీల ద్వారా క్షేత్రస్థాయిలో పాలన మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. బదిలీ అయిన వారు విధుల్లో చేరిన వివరాలను వెంటనే కార్యాలయానికి నివేదించాలని   జిల్లా పంచాయతీ అధికారులను కమిషనర్ ఆదేశించారు.