డయాలసిస్‌‌ బాధితులకు సర్కారు చేయూత

డయాలసిస్‌‌ బాధితులకు సర్కారు చేయూత
  • కొత్తగా 2,356 మందికి పింఛన్లు మంజూరు
  • వచ్చే నెల నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. డయాలసిస్‌‌  చేయించుకుంటున్న బాధితులకు కొత్తగా చేయూత పింఛన్లను మంజూరు చేసింది. తాజాగా 2,356 మంది బాధితులకు పింఛన్లు మంజూరు చేస్తూ మంత్రి సీతక్క శుక్రవారం ఫైల్ పై సంతకం చేశారు. వీరందరికీ వచ్చే నెల నుంచే ప్రతి నెలా రూ.2,016 పింఛను నగదు అందనుంది.  కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 4,710 మందికి పింఛన్లు ఇస్తుండగా.. తాజా మంజూరుతో ఈ సంఖ్య 7,066కు చేరింది. కాగా, ప్రస్తుతం మరో 488 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హులైన వారందరికీ త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. 

కొత్తగా 79 డ‌‌యాల‌‌సిస్  కేంద్రాలు.. 

పింఛన్లతో పాటు బాధితులకు చికిత్సను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్‌‌  కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నిరుడు 18 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. బాధితులకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని సీతక్క పేర్కొన్నారు.