- భయంతోనే వారిద్దరూ పిటిషన్లు వేశారు
- సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు కమిషన్ రిపోర్టులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టులో వాదన
హైదరాబాద్, వెలుగు: ఏ డిజైన్ ఖరారు కాకుండానే రూ.85 కోట్ల ప్రజాధనంతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందని, కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ వద్ద పిల్లర్ కుంగుబాటుకు గురైందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. రూ.1.47 లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోయినా.. విచారణ వద్దంటే ఎలా? అని ప్రశ్నించింది. పత్రికల్లో కథనాలు వచ్చినందున తమ ప్రతిష్ట దెబ్బతిన్నదని పిటిషనర్లు ఆందోళనతో కోర్టుకు వచ్చారని తప్పుపట్టింది.
కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావు ప్రతిష్టకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పింది. మేడిగడ్డ పిల్లర్ బీటలు వారిన వ్యవహారంపై సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు ఇతరులు వేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరింది. నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు కమిషన్ రిపోర్టు విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.
పనులు చేపట్టినప్పుడు నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణాలు పాటించలేదని తెలిపింది. హైపవర్ కమిటీ, నిపుణుల కమిటీ, కేబినెట్ కమిటీ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఆ కమిటీల అడ్వయిజ్‌లను పట్టించుకోని కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పియర్ బీటలు వారిందని ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.
నిజనిర్ధారణ కోసమే కమిషన్ ఏర్పాటు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 6ను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌కే జోషి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని సింఘ్వీ వాదించారు.
మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైనవాళ్లు ఎవరో తేలాల్సి ఉందని, కమిషన్ ఏర్పాటు జీవో జారీ సమయంలో ఆ ప్రక్రియపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో నిజనిర్ధారణ కోసమే కమిషన్ ఏర్పాటు అయ్యిందన్నారు. పిటిషనర్లు ఎందుకు భయడపతున్నారో అర్థం కావడం లేదన్నారు.
కమిషన్ నోటీసు ఇస్తే సవాల్ చేయలేదని, కమిషన్ విచారణకు సహకరించిన హరీశ్ రావు నివేదికను సవాల్ చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు. కమిషన్ ఏర్పాటు నిబంధనలోనే బాధ్యులను గుర్తించాల్సి ఉందని గుర్తుచేశారు. పిటిషనర్ కోరిన వివరాలన్నీ నోటీసు ద్వారా విచారణకు పిలిచినట్టు చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టులో బ్యారేజ్ నిర్మాణంలోని లోపాల గురించి పేర్కొందని తెలిపారు.
