ఎంబీబీఎస్ కౌన్సెలింగ్​లో మారిన రూల్

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్​లో మారిన రూల్
  • ఇకనుంచి ఒకేసారి ఆప్షన్స్.. ఎట్టకేలకు జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కార్ 
  • ఓపెన్ కేటగిరీలో మనోళ్లకు న్యాయం జరిగే చాన్స్ 
  • రెండేండ్ల కిందనే ఈ రూల్ తెచ్చిన ఏపీ

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్‌, బీడీఎస్ సీట్లలో మన స్టూడెంట్లకు న్యాయం జరిగేలా రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు కౌన్సెలింగ్ ప్రొసీజర్‌‌లో మార్పులు చేసింది. 2017లో విడుదల చేసిన జీవో 114లో మార్పులు చేస్తూ, జీవో 187ను గురువారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌ను శుక్రవారం రిలీజ్ చేయనుంది. గతంలో ప్రతి రౌండ్‌ కౌన్సెలింగ్ కు స్టూడెంట్లు ఆప్షన్స్‌ ఇవ్వాల్సి ఉండేది. ఇకపై ఒకేసారి ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు స్టూడెంట్ తనకు నచ్చిన ఆర్డర్‌‌లో ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఈ ఆప్షన్లనే అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌కు వాడుకుంటారు. దీని వల్ల ఓపెన్ కేటగిరీలో ఉన్న 15 శాతం సీట్లలో తెలంగాణ స్టూడెంట్లకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏపీలో ఈ తరహా రూల్​ను రెండేండ్ల కిందటే అమల్లోకి తెచ్చారు. కాగా, రిజర్వ్ డ్ కేటగిరీ స్టూడెంట్లకు అన్యాయం జరగడానికి కారణమవుతున్న రూల్ ను మాత్రం మన సర్కార్ మార్చలేదు. ప్రస్తుతమున్న కౌన్సెలింగ్ ప్రొసీజర్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లకు దక్కాల్సిన సీట్లు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్లకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీలో మార్పులు చేసినప్పటికీ, దాన్ని మన సర్కార్ పరిగణనలోకి తీసుకోలేదు. 

విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లను ఇరు రాష్ట్రాల స్టూడెంట్లకు చాన్స్ వచ్చేలా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. నీట్‌‌లో మెరిట్ ర్యాంకు ఎవరికి ఉంటే, వారికే సీటు ఇస్తారు. ఈ కేటగిరీలో ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం ఏపీ, తెలంగాణ నుంచి మెరిట్ ర్యాంకులు సాధించిన స్టూడెంట్లు పోటీ పడుతున్నారు. ఫస్ట్ రౌండ్ సీట్ల కేటాయింపు తర్వాత కొంత మంది స్టూడెంట్లు ఆ సీట్లను వదిలేసుకుంటున్నారు. ఏపీలో ఇలా మిగిలిన సీట్లను, మెరిట్​లిస్టులో తర్వాతి ప్లేస్‌‌లో ఉన్న లోకల్ స్టూడెంట్లకే ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఇలా మిగిలిన సీట్లను మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న తెలంగాణ స్టూడెంట్లకు ఇవ్వకుండా, సెకండ్​ఫేజ్‌‌లో భర్తీ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్‌‌లో తెలంగాణ స్టూడెంట్లు తక్కువ మంది పాల్గొనడం వల్ల, మెజారిటీ సీట్లు ఏపీ స్టూడెంట్లకు దక్కుతున్నాయి. తొలుత ఏపీలోనూ ఇదే తప్పు చేశారు. తెలంగాణ స్టూడెంట్లకు ఎక్కువ సీట్లు రావడం గమనించి, రెండేండ్ల కిందటే రూల్స్‌‌ మొత్తం మార్చేశారు. ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో మిగిలిన సీట్లు ఏపీ వాళ్లకే దక్కేలా జీవో తెచ్చారు. కానీ, మన దగ్గర మాత్రం పాత జీవో ప్రకారం కౌన్సిలింగ్ చేస్తూ వచ్చారు. దీంతో తెలంగాణ స్టూడెంట్లకు దక్కాల్సిన సీట్లు ఏపీ స్టూడెంట్లకు వచ్చాయి. దీనిపై 2020లో ‘వెలుగు’ వరుస కథనాలు ప్రచురించింది. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకొని, కౌన్సెలింగ్ ప్రొసీజర్‌‌‌‌లో మార్పులు చేయిస్తామని ప్రకటించారు. కానీ, అది మాటలకే పరిమితమైంది. ఇదే విషయాన్ని ‘మళ్లీ మనోళ్లకు అన్యాయమే’ శీర్షికతో ఈ ఏడాది సెప్టెంబర్ 27న వెలుగు మరోసారి ప్రచురించింది. దీంతో కౌన్సెలింగ్ ప్రొసీజర్‌‌‌‌లో మార్పుల కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ సూచనల మేరకు కౌన్సెలింగ్ లో మార్పులు తీసుకొచ్చింది.