60 ఏండ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు భూములు మావే అంటే ఎలా?..పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

60 ఏండ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు భూములు మావే అంటే ఎలా?..పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: భూ హక్కులపై అరవై ఏండ్లు మౌనంగా, ఇప్పుడు ఆ భూములు తమవే అంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 60 ఏండ్ల పాటు జాప్యం చేయడాన్ని తప్పుబట్టింది. పిటిషన్ల దాఖలులో అసాధారణ జాప్యాన్ని అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నం 22లో 3.14 ఎకరాల భూమికి సంబంధించి హక్కుల కోసం వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. గత 100 ఏండ్లుగా తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను సవరించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ తూర్పు సంజీవరెడ్డి సహా మరో నలుగురు 2019లో వేసిన పిటిషన్లను జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారించారు. 

పిటిషనర్‌ తరఫు, ప్రభుత్వ న్యాయవాదుల విన్న తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. 60 ఏండ్ల నుంచి వినతి పత్రాలు ఇచ్చే విషయంలో జరిగిన జాప్యానికి సరైన కారణాలను చెప్పలేదని పేర్కొంది. సరైన కారణాలు లేకుండా అసాధారణ జాప్యంతో దాఖలు చేసిన పిటిషన్లను అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.