మిల్లర్లపై కేసుల దర్యాప్తు జరగాల్సిందే..58 పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

మిల్లర్లపై కేసుల దర్యాప్తు జరగాల్సిందే..58 పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ నిమిత్తం సరఫరా చేసిన వడ్లను మిల్లర్లు దారి మళ్లించారని నమోదైన క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మిల్లర్లు దాఖలు చేసిన 58 పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 2022-–23లో మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ కోసం సరఫరా చేసిన ధాన్యాన్ని దారి మళ్లించారని, రూ.3,960 కోట్ల బకాయిల చెల్లింపులో విఫలమయ్యారంటూ పలువురు మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టేయాలని కోరుతూ 360 మంది మిల్లర్లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై కోర్టు శుక్రవారం విచారించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ధాన్యం నాణ్యత సరిగా లేదన్నారు. సివిల్‌‌‌‌‌‌‌‌ వివాదంపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం తరఫు అడ్వొకేట్లు వాదిస్తూ, మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ కోసం సరఫరా చేసిన వడ్లను దారి మళ్లించి, వచ్చిన సొమ్మును స్థిర, చరాస్తుల్లో, సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టారన్నారు.  దీంతో ధాన్యం రక్షణ బాధ్యత మిల్లర్లదేనని కోర్టు తెలిపింది. మిల్లర్లు, ఉద్యోగుల మధ్య ఏదైనా కుట్ర ఉంటే దర్యాప్తులో తేలుతుందని పేర్కొంది