న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య అసాధారణ రీతిలో పెరుగుతోన్న దృష్ట్యా జడ్జీల సంఖ్యను పెంచాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కి రాష్ట్ర న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తో ప్రత్యేకంగా సమావేశం అయింది. సీజేఐ ఛాంబర్ లో జరిగిన ఈ మీటింగ్ లో వినతి పత్రం సమర్పించింది.
కేసుల సత్వర పరిష్కారం, న్యాయ పరిపాలన సమర్థవంతంగా సాగేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా ప్రస్తుత జడ్జీల సంఖ్యను పెంచడంతో పాటు ఖాళీగా ఉన్న జడ్జీల స్థానాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో కేసుల విచారణ తీరుపై సీజేఐ సంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాలను అనుసరిస్తూ... తెలంగాణ బార్ కౌన్సిల్ లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడంపై కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు అడ్వొకేట్లు తెలిపారు. బార్ కౌన్సిల్ లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం వల్లే తనకు అవకాశం దక్కిందని అడ్వొకేట్ పి కృష్ణ కీర్తన సీజేఐకు తెలిపారు.
