వార్నర్‌‌ బ్రదర్స్‌‌ పిక్చర్స్‌‌పై కేసు కొట్టివేత

వార్నర్‌‌ బ్రదర్స్‌‌ పిక్చర్స్‌‌పై కేసు కొట్టివేత
  • వాణిజ్య వివాదాల్లో ఒత్తిడికి క్రిమినల్‌‌ కేసులు చెల్లవన్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వాణిజ్య పరమైన వివాదాల్లో  ఒకరిపై ఒత్తిడి తీసుకురావడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా క్రిమినల్‌‌ కేసులు పెట్టడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 'వార్నర్‌‌ బ్రదర్స్‌‌ పిక్చర్స్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌' పిక్చర్స్ సంస్థ పంపిణీ హక్కుల వివాదానికి సంబంధించి హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో నమోదైన క్రిమినల్‌‌ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

సినిమా పంపిణీదారు జీ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు 2016లో తనపై నమోదైన క్రిమినల్‌‌ కేసును కొట్టేయాలంటూ వార్నర్‌‌ బ్రదర్స్‌‌ పిక్చర్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌‌పై జస్టిస్‌‌ ఎన్‌‌. తుకారాంజీ విచారణ జరిపారు. పంపిణీకి సంబంధించిన ఈ వివాదంలో రూ. 25 లక్షలు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ కేసు పెట్టారని.. అయితే ఇందులో కేవలం వ్యాపార ఒప్పంద హామీ ఉల్లంఘన మాత్రమే జరిగిందని న్యాయమూర్తి తేల్చారు. పిటిషనర్, పంపిణీదారుల మధ్య జరిగిన వ్యాపార ఒప్పందాలను పరిశీలిస్తే.. ఎక్కడా మోసం చేయాలనే దురుద్దేశం కనబడటం లేదని కోర్టు అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని కీలక తీర్పులను న్యాయమూర్తి ఉదహరించారు. ఇరు పక్షాల మధ్య సుదీర్ఘకాలం పాటు రాతపూర్వక ఒప్పందాలు జరిగాయని, అయితే అందులో డబ్బు అప్పగింతకు సంబంధించిన స్పష్టమైన పరిధి లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సివిల్‌‌ వివాదం, ఒక క్రిమినల్‌‌ కేసు పెండింగ్‌‌లో ఉండగా.. మళ్లీ ఇంకో క్రిమినల్‌‌ కేసు పెట్టడం చూస్తుంటే వాణిజ్య వివాదంలో అవతలి పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నంలాగే కనిపిస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇటువంటి కేసుల వల్ల పోలీసుల సమయం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు.

వ్యాపార ఒప్పందాల ఉల్లంఘన జరిగినప్పుడు ఫిర్యాదుదారునికి చట్టప్రకారం సివిల్‌‌ కోర్టుల ద్వారా పరిహారం పొందే పూర్తి హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సివిల్ స్వభావం ఉన్న వివాదాలకు క్రిమినల్ రంగు పులమడం సరికాదని హితవు పలికింది. ఈ మేరకు వార్నర్ బ్రదర్స్ సంస్థపై నమోదైన తదుపరి కేసుల చట్టపరమైన చర్యలన్నింటినీ రద్దు చేస్తూ హైకోర్టు తుది తీర్పునిచ్చింది.