సెలవుల్లో ఇండ్ల కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

సెలవుల్లో ఇండ్ల  కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
  •     నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని హైడ్రాను నిలదీసిన ధర్మాసనం
  •     ఐలాపూర్‌‌ తండాలో ఇండ్ల కూల్చివేతలపై స్టేటస్‌‌కో

హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలను సెలవుల్లోనే ఎందుకు కూల్చివేస్తున్నారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. బుల్డోజర్‌‌ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినా హైడ్రా తీరుమారకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. కూల్చివేతలు చేపట్టే సమయంలో నిబంధనలు పాటించాలంటూ ఎన్నిసార్లు చెప్పినా అమలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐలాపూర్‌‌ తండాలో ఇండ్ల కూల్చివేతలపై యథాతధస్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా చేపట్టిన కూల్చివేతలను అడ్డుకోవాలని కోరుతూ ఐలాపూర్‌‌ తండాకు చెందిన గజ్జా రంగారావు మరో 12 మంది హైకోర్టులో హౌస్‌‌ మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది రామవరపు చంద్రశేఖర్‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఐలాపూర్‌‌ తండాలో సర్వే నంబర్119లో సుమారు 3 వేల మంది ఉన్నారని తెలిపారు. ఇందులో అందరూ100 గజాల్లోపే ఇండ్లు నిర్మించుకున్నారని, వీరంతా రోజువారీ కూలీ పనులు చేసుకునేవారేనని చెప్పారు. 

ఈ ఇండ్లకు విద్యుత్, నీటి పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సుమారు 3 వేల మంది హైడ్రాకు చెందిన డీఆర్‌‌ఎఫ్‌‌ సిబ్బంది ఆయుధాలు, బుల్డోజర్లు, జేసీబీలతో వచ్చి ఇండ్ల కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఐలాపూర్‌‌ తండాలో యథాతధస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రంగారెడ్డి కలెక్టర్, అమీన్‌‌పూర్‌‌ తహసీల్దార్, హైడ్రా, పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.