- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగులపల్లి, భూపాలపల్లి పోలీసు స్టేషన్‌లలో 2023లో సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరునుంచి మినహాయింపునిస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో గండ్ర ఫిర్యాదు మేరకు నమోదైన 2 ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేశారు.
వీటిని జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్‌కు చెందిన ఫిర్యాదుదారు ఒకే ఆరోపణపై రెండు వేర్వేరు ఫిర్యాదులు చేయడంలో దురుద్దేశం ఉందని తెలిపారు. ఇవి కింది కోర్టులో విచారణకు రానున్నాయని, దీంతో విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. దీనికి న్యాయమూర్తి నిరాకరిస్తూ హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఫిర్యాదుదారు వెంకటరమణారెడ్డితోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావును ఆదేశిస్తూ విచారణను మార్చి 5కు వాయిదా వేశారు.
