టీఎస్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ పరీక్షలపై సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

టీఎస్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ పరీక్షలపై  సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ ఫలితాలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. 2024  సెప్టెంబరులో జరిగిన టీఎస్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ కీలో 29 లోపభూయిష్టమైన ప్రశ్నలున్నందున ఫలితాలను నిలిపివేయాలని, నియామక ప్రక్రియ నిలిపివేయాలని కోరుతూ వి.శరణ్య, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిని విచారించిన సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి గడువులోగా అభ్యంతరాలు తెలియజేయకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ శరణ్య తదితరులు అప్పీలు దాఖలు చేశారు. 

దీనిపై సీజే అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జీఎం మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టింది. ఉస్మానియా వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024 సెప్టెంబరు 23న ప్రాథమిక కీ విడుదల చేసి అక్టోబరు 11 లోగా అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించినట్టు తెలిపారు. గడువులోగా వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించాక నవంబరు 16న తుది కీ విడుదల చేశామన్నారు. వాదనలను విన్న బెంచ్‌‌‌‌‌‌‌‌ రికార్డులను పరిశీలిస్తే ప్రాథమిక కీ విడుదలైన తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు 25 ప్రశ్నలకు మార్కులు వేసినట్లుందని పేర్కొంది. అప్పీలుదారులు మరో 14 ప్రశ్నలున్నాయంటూ ఏడాది తరువాత పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేయడం సరికాదంది. ప్రస్తుతం ప్రధాన పిటిషన్‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నందున సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ అప్పీలును కొట్టివేసింది.