జూబ్లీహిల్స్‌‌‌‌ హౌస్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ పై స్టే

జూబ్లీహిల్స్‌‌‌‌ హౌస్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ పై స్టే
  • విచారణను ఈ  నెల 30కి వాయిదా వేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ హౌస్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ సొసైటీ ఎన్నికల నిమిత్తం జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌పై హైకోర్టు స్టే విధించింది. గత నెల 18న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌తోపాటు ఎన్నికల ప్రక్రియను నిలిపివేసింది. సహకార సంఘ చట్టం నిబంధనలతోపాటు సొసైటీ బైలాస్‌‌‌‌కు విరుద్ధంగా జారీ అయిన నోటిఫికేషన్‌‌‌‌ను సవాల్​చేస్తూ ఈ.సునీల్‌‌‌‌రెడ్డి మరో 17 మంది హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ సూరేపల్లి నంద గురువారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024లో 270 మందికి సభ్యత్వం ఇవ్వడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 887 మందిపై అనర్హత వేటు వేసిందని, దీనిపై 34 మంది అభ్యంతరం వ్యక్తం చేసినా సహకార శాఖ రిజిస్ట్రార్‌‌‌‌ పట్టించుకోలేదని తెలిపారు. ఓటర్ల జాబితా వ్యవహారంలో జోక్యం చేసుకోలేనని తేల్చిచెప్పడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. సొసైటీ తరఫున సీనియర్‌‌‌‌ న్యాయవాది ఆర్‌‌‌‌.ఎన్‌‌‌‌.హేమేంద్రనాథ్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ జారీ అయ్యాక ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. 

వాదనలను విన్న న్యాయమూర్తి సొసైటీ ఓటర్ల జాబితా, కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్న కారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు పలు తీర్పులను ప్రస్తావిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.