దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు(Raghavendra rao)కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఓ భూ వివాదం కారణంగా రాఘవేంద్ర రావు, కె. కృష్ణమోహన్‌(K Krishnamohan)లకు నోటీసులు జారీచేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వం గతంలో రాఘవేంద్రరావుకు షేక్ పేట్ లో రెండెకరాల భూమిని కేటాయించింది.

అయితే.. ఈ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బాలకిషన్‌(Balakishan) అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాయితీతో కూడిన ధరతో ప్రభుత్వం ఆ భూమిని కేటాయించింది కానీ.. ఆ భూమిని నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారని, పబ్, థియేటర్ అంటూ దుర్వినియోగం చేస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నాడు బాలకిషన్‌. బాలకిషన్‌ వేసిన పిటీషన్ మేరకు రాఘవేంద్ర రావు,కె. కృష్ణమోహన్‌లకు నోటీసులు పంపింది హైకోర్టు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ జరిపింది.