నోటీసులివ్వకుండా ఎట్ల కూల్చుతరు?..హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు

నోటీసులివ్వకుండా ఎట్ల కూల్చుతరు?..హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని జ్రెస్టా విల్లా కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ను నోటీసులివ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. నోటీసులివ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించింది.  విల్లా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.ఈ నెల 26న తమ ఆవరణలోకి హైడ్రా అక్రమంగా ప్రవేశించి వెనుకవైపున కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ను కూల్చివేసిందంటూ జ్రెస్టా విల్లా ఓనర్స్‌‌‌‌‌‌‌‌ మెయింటెన్స్‌‌‌‌‌‌‌‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌‌‌‌‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ తరఫున కోశాధికారి ప్రణవ్‌‌‌‌‌‌‌‌ పంకజ్‌‌‌‌‌‌‌‌ షా హైకోర్టులో హౌస్‌‌‌‌‌‌‌‌మోషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ నగేశ్‌‌‌‌‌‌‌‌ భీమపాక బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..సర్వే నెం.84లో మొత్తం 9.19 ఎకరాలుందని, 8.14 ఎకరాలు పట్టా భూమికాగా ఇందులో 1.09 ఎకరాలను కొత్తచెరువు కోసం బఫర్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌ భూమిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. మిగిలిన 6.14 ఎకరాలను గోల్డ్‌‌‌‌‌‌‌‌ఫిష్‌‌‌‌‌‌‌‌ అడోబ్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ కంపెనీ భూమి యజమానులతో ఒప్పందం చేసుకుని విల్లాలను నిర్మించి 2019లో అప్పగించిందన్నారు.

1.09 ఎకరాలకు సంబంధించి నిర్మాణ కంపెనీ, భూమి యజమానులకు వివాదం కోర్టులో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందని చెప్పారు. అనిల్‌‌‌‌‌‌‌‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారి మార్చి 31న మార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేపట్టారని వివరించారు.  నోటీసులివ్వకుండా 26న అక్రమంగా విల్లా ఆవరణలోకి ప్రవేశించి వెనుకవైపునున్న కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ను కూల్చివేయడంతోపాటు కంచె వేసేందుకు యత్నించారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని.. యథాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.